‘అబ్బ.. ఈ కుర్తీ ఎంత బాగుందో.. కానీ నా ఎత్తుకి ఇది సూట్ కాదు!’ అని బాధపడుతోంది ప్రియ.
‘నేను ఇంకాస్త పొడవుంటే ఈ స్లిట్ కుర్తీ నాకు భలే సరిపోయేది’ అంటూ తనకు నచ్చిన కుర్తీని కొనలేకపోతోంది దివ్య.
కాస్త పొడవు తక్కువగా ఉన్న వారు కొన్ని ఆధునిక ఫ్యాషన్లను ఫాలో అవడానికి వెనకా ముందూ అవుతుంటారు. కారణం.. అవి తమకు నప్పవేమోనని! అయితే పొడవుగా లేకపోయినా కూడా కుర్తీల ఎంపిక విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే స్టైలిష్‌గా మెరిసిపోవచ్చంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అంతేకాదు.. అవి కాస్త పొడవుగా కనిపించేలా కూడా చేస్తాయట! మరి, ఇంతకీ కుర్తీల్లో పొడవుగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
‘పలాజో’ను జత చేస్తే సరి!
అతివల అభిరుచులకు తగినట్లుగా ప్రస్తుతం బోలెడన్ని ఫ్యాషన్ ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్టైల్‌తో పాటు సౌకర్యాన్ని అందించే అవుట్‌ఫిట్స్ గురించి చెప్పాలంటే పలాజోలు ముందు వరుసలో ఉంటాయి. కాస్త వదులుగా ఉండే ప్యాంట్స్ దగ్గర్నుంచి ఫ్లేర్డ్ తరహాలో.. ఇలా విభిన్న మోడల్స్‌లో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి పలాజో ప్యాంట్స్‌ని మీరు ఎంచుకున్న కుర్తీకి జత చేయచ్చు. అయితే అవి మీ టాప్కు మ్యాచింగ్‌గా లేదంటే అపోజిట్ కలర్స్ కూడా ఎంచుకోవచ్చు. అలాగే మీరు ఎంచుకున్న కుర్తీ పొట్టిదైనా, పొడవుగా ఉన్నా సరే దానికి పలాజో ప్యాంట్ జత చేయడం వల్ల పొడగరిగా కనిపించచ్చంటున్నారు నిపుణులు. అలాంటి ఓ అందమైన కుర్తీ-పలాజోను అందరికీ పరిచయం చేస్తోంది టాలీవుడ్ బేబ్ రష్మీ గౌతమ్.
‘స్లిట్’తో స్టైలిష్ లుక్!
ప్రస్తుతం కుర్తీల్లోనూ విభిన్న డిజైన్లు, మోడల్స్ మగువల మనసు దోచుకుంటున్నాయి. వాటన్నింటిలోకెల్లా ఎక్కువమంది అమ్మాయిలు ఇష్టపడుతోన్న కుర్తీ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే అది స్లిట్ ఫ్యాషన్ అనడంలో సందేహం లేదు. మగువల స్టైల్ కోషెంట్ను అమాంతం పెంచేస్తున్నాయివి. అయితే ఇలాంటి స్లిట్ తరహా కుర్తీలు సాధారణంగానే కాస్త పొడవుగా ఉంటాయి. అందుకే తమకు నప్పవేమోనని పొట్టిగా ఉన్న అమ్మాయిలు వేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. కానీ నిజానికి ఈ తరహా దుస్తులు పొట్టిగా ఉన్న వారిని కాస్త పొడవుగా కనిపించేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అయితే అలాంటి కుర్తీల్లోనూ మరీ పొడవుగా ఉండేవి కాకుండా.. మోకాళ్ల కంటే కాస్త కిందికి ఉన్న కుర్తీలను ఒకటికి రెండుసార్లు ట్రై చేసి సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక వీటికి జతగా డెనిమ్ ప్యాంట్, పలాజో.. వంటివీ ప్రయత్నించి పొడవుగా కనిపించచ్చని సలహా ఇస్తున్నారు. అలాంటి స్లిట్ అవుట్‌ఫిట్‌లో శ్రద్ధ చూడండి ఎంత క్యూట్‌గా మెరిసిపోతోందో!
‘ప్రింట్స్’ విషయంలో ఇది గుర్తుంచుకోండి!
ఫ్లోరల్ ప్రింట్స్, జామెట్రిక్ ప్రింట్స్, యానిమల్ ప్రింట్స్.. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయి ఈ తరహా ప్రింటెడ్ అవుట్‌ఫిట్స్. ఇందులోనూ విభిన్న ప్రింట్స్‌తో కూడిన కుర్తీలను ఎంచుకొని రోజువారీ అవుట్‌ఫిట్స్ జాబితాలో చేర్చేసుకోవడానికి మగువలు తెగ ముచ్చటపడిపోతున్నారు. అయితే ప్రింటెడ్ కుర్తీస్ని ఎంచుకునే విషయంలో పొట్టిగా ఉండే అమ్మాయిలు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు ఫ్యాషనర్లు. మరీ చిందరవందరగా ఉండే ప్రింట్స్ కాకుండా పొడవాటి గీతలు, అక్కడక్కడా పువ్వులుండే సింపుల్ కుర్తీలతో పొడవుగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో టాప్ ప్లెయిన్‌గా ఉంటే బాటమ్ ప్రింటెడ్ లేదంటే టాప్ ప్రింటెడ్ది అయితే బాటమ్ ప్లెయిన్.. ఇలాంటి కాంబినేషన్‌ని కూడా ప్రయత్నించచ్చు.. లేదు రెండూ ప్రింటెడ్ కావాలనుకున్న వారు పొడవాటి గీతలుండే తరహా ప్రింటెడ్ కుర్తీ-ప్యాంట్‌ని ఎంచుకుంటే ఇటు స్టైలిష్‌గా, అటు పొడవుగా కనిపించేయచ్చు. కావాలంటే ఓసారి విద్యాబాలన్ అవుట్ఫిట్పై ఓ లుక్కేయండి!
‘ఫ్లోర్లెంత్’ కావాలా?
కాస్త పొట్టిగా ఉండే వారు ఫ్లోర్లెంత్ కుర్తీ లేదంటే అనార్కలీ వేసుకోవడానికి వెనకాముందూ అవుతుంటారు. అలాంటి దుస్తులు పొడవుగా ఉండే వాళ్ల కోసమేనేమో అన్న భావనలో ఉండేవారూ లేకపోలేదు. అయితే ఫ్లోర్లెంత్ కుర్తీలు పొట్టిగా ఉండే వారికీ చక్కగా నప్పుతాయంటున్నారు డిజైనర్లు. పైగా ఇవి పొడవుగా కూడా కనిపించేలా చేస్తాయట! అయితే వీటిని ఎంచుకునే క్రమంలో ముందు భాగంలో పై నుంచి కింది వరకు బటన్స్, స్లిట్ తరహాలో కనిపిస్తూ రెండువైపులా ఎంబ్రాయిడరీ చేసినట్లుగా.. ఇలాంటి తరహా ఫ్లోర్లెంత్ దుస్తులు చూడ్డానికి ట్రెండీగా కనిపిస్తూనే, పొడుగ్గానూ కనిపించేలా చేస్తాయి. అలాంటి ఓ క్యూట్ డ్రస్ ధరించి తన ఓరనవ్వుతో అందరినీ కట్టిపడేసింది కియారా.
యాక్సెసరీస్ ఇలా!
మనం ఎలాంటి దుస్తులు ధరించినా.. వాటికి మ్యాచింగ్‌గా ధరించే యాక్సెసరీస్ కూడా మన లుక్‌ని ఇనుమడింపజేస్తాయనడంలో సందేహం లేదు. అయితే కాస్త పొడవు తక్కువగా ఉండే వారు ఎంచుకునే కుర్తీల పైకి ధరించే యాక్సెసరీస్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ఎంచుకున్న కుర్తీకి మ్యాచింగ్ లేదంటే అపోజిట్ కలర్ బెల్టు ధరించడం, తక్కువ జ్యుయలరీ, హీల్స్.. వంటివన్నీ మీ లుక్‌ని మరింత స్టైలిష్‌గా, ట్రెండీగా మార్చడంతో పాటు పొడవుగానూ కనిపించేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అదితీ రావ్ హైదరి చూడండి.. తన డ్రస్‌పై ఎంత సింపుల్ యాక్సెసరీస్‌తో అదరగొట్టేస్తోందో!
సో.. ఇవండీ! పొడవు తక్కువగా ఉండే వారు చక్కటి కుర్తీలను ఎంచుకొని పొడవుగా కనిపించేందుకు కొన్ని చిట్కాలు! మరి, ఇవి కాకుండా మీకు తెలిసిన ఇతర చిట్కాలేవైనా ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు!