ముఖం కాస్త జిడ్డుగా ఉంటేనే దాన్ని వదిలించుకోవడానికి పదే పదే కడుక్కుంటాం. అలాంటిది నూనెతో ముఖాన్ని శుభ్రపరచుకోవడమంటే అదేదో వింతగా చూసి ఆమడదూరం పరిగెత్తుతాం. నిజానికి ఆయిల్ క్లెన్సింగ్‌తో చర్మానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ముఖంపై మొటిమల్ని తగ్గించడం దగ్గర్నుంచి చర్మ ఛాయను పెంచే దాకా; మేకప్‌ను తొలగించడం దగ్గర్నుంచి చర్మానికి తేమనందించే దాకా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సౌందర్య పద్ధతితో ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయి. మరి, ఇంతకీ ముఖంపై పేరుకున్న నూనెల్ని తొలగించడం తెలుసు కానీ ఏకంగా నూనెతోనే ముఖాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారు? అందుకోసం ఏయే నూనెల్ని ఉపయోగించచ్చు? ఈ పద్ధతి ద్వారా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
ముఖం కడుక్కోవడమంటే మనకు నచ్చిన సబ్బు/ఫేస్‌వాష్‌తో రుద్ది మరీ కడుక్కుంటాం. చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళిని వదిలించుకోవడానికే ఈ పాట్లన్నీ! కానీ ఇదే పద్ధతిని నూనె మరింత సమర్థంగా చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఇందుకోసం ఆయా చర్మతత్వాలను బట్టి నూనెల్ని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఏ చర్మానికి ఏ నూనె?
జిడ్డు చర్మం, పొడి చర్మం, కాంబినేషన్ స్కిన్.. ఇలా ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలో ఆయిల్ క్లెన్సింగ్ కోసం ఆయా చర్మతత్వాల్ని బట్టి నూనెల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
* జిడ్డు చర్మం ఉన్న వారు గ్రేప్సీడ్ ఆయిల్, గుమ్మడి గింజల నూనె, సన్‌ఫ్లవర్.. వంటి నూనెల్ని ఎంచుకోవచ్చు.
* మొటిమలతో బాధపడే వారు జొజోబా, ఆముదం నూనె ఉపయోగించచ్చు.
* సున్నితమైన చర్మం గల వారు క్యామెల్లా ఆయిల్ (గులాబీని పోలి ఉండే పువ్వు నుంచి తీసిన నూనె) వాడచ్చు.
* ఇక పొడి చర్మతత్వం గల వారికి అవకాడో, బాదం, ఆలివ్ నూనె చక్కటి ఎంపిక.
ఈ నూనెలన్నీ సూపర్మార్కెట్లలో దొరుకుతాయి. అయితే వాటిని ఎంచుకునే ముందు, వాడే ముందు ఓసారి లేబుల్‌ని కూడా చదివితే.. దానిపై ఉన్న సూచనల ప్రకారం ఫాలో అయిపోవచ్చు.

ఇలా శుభ్రం చేసుకోవాలి!
ఇంట్లో ఉన్నా, వృత్తి ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లినా వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మ రంధ్రాల్లోకి చేరి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్, మృతకణాలు.. వంటి పలు సౌందర్య సమస్యలకు దారితీస్తుంది. అయితే చర్మంపై చేరిన ఈ వ్యర్థాలను తొలగించుకోవడానికి ఆయిల్ క్లెన్సింగ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం..
* ముందుగా మీ చర్మతత్వాన్ని బట్టి టీస్పూన్ నూనెను అరచేతుల్లోకి తీసుకొని బాగా మర్దన చేయాలి. తద్వారా ఆ నూనె కాస్త వేడెక్కుతుంది.
* ఇప్పుడు ఆ నూనెను మెడ దగ్గర్నుంచి గడ్డం, బుగ్గలు, నుదురు దాకా గుండ్రంగా తిప్పుతూ పైవైపుగా మర్దన చేసుకుంటూ రావాలి. ఇలా రెండు చేతులతో ముఖానికి రెండువైపులా మసాజ్ చేస్తూ నూనెను పట్టించాలి.
* ఈ క్రమంలో ముఖ చర్మంలోని రంధ్రాల్లోకి నూనె బాగా ఇంకి.. అక్కడ పేరుకున్న దుమ్ము-ధూళి, మేకప్ అవశేషాలను మెత్తబరుస్తుంది.
* ఇలా కొన్ని నిమిషాల పాటు ఆయిల్‌తో మర్దన చేసుకున్నాక కాస్త వేడిగా ఉన్న నీటిలో ముంచి పిండిన శుభ్రమైన క్లాత్‌ను ముఖంపై వేసుకొని రిలాక్సవ్వాలి.
* పది నిమిషాలయ్యాక అదే క్లాత్‌తో జిడ్డు లేకుండా ముఖాన్ని తుడుచుకోవాలి.
* ఈ క్రమంలో నూనె చర్మ రంధ్రాల్లోకి చేరిన దుమ్ము-ధూళి, మేకప్ అవశేషాలను తొలగిస్తే.. వేడి నీళ్లు జిడ్డును తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
* ఇక ఇప్పుడు పొడి వస్త్రంతో తుడిచేసుకుంటే ఆయిల్ క్లెన్సింగ్ పూర్తయినట్లే! ఒకవేళ మీది పొడి చర్మమైతే ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మరవద్దు!

మొటిమల్ని తొలగిస్తుంది.. తేమనందిస్తుంది!
* చర్మానికి తేమనందించడంలో ఆయిల్ క్లెన్సింగ్ ప్రక్రియ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చర్మంలో ఎక్కువ సేపు తేమను నిలిపి ఉంచుతుంది. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఈ పద్ధతిని ఫాలో అవడం వల్ల నూనెలు చర్మంలోకి బాగా ఇంకుతాయి.
* జిడ్డు చర్మతత్వం గల వారు, మొటిమలతో బాధపడే వారు ఆయిల్ క్లెన్సింగ్ చేసుకుంటే ముఖం మరీ జిడ్డుగా మారుతుందనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ అంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ ప్రక్రియ వల్ల జిడ్డును కలిగించే సీబమ్ ఉత్పత్తి అదుపులోకొస్తుంది. తద్వారా మొటిమలు రాకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.
* కొబ్బరి నూనెను మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగిస్తుంటాం. అంతేకాదు.. ఈ నూనెతో చర్మంపై మర్దన/క్లెన్సింగ్ చేసుకోవడం వల్ల చర్మానికి పోషణ అంది నవయవ్వనంగా మారుతుంది.
* ఆయిల్ క్లెన్సింగ్ కోసం ఉపయోగించే నూనెల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. తద్వారా ముఖంపై ముడతలు, గీతలు, వృద్ధాప్య ఛాయలు.. వంటివి రాకుండా జాగ్రత్తపడచ్చు.
* నూనెతో ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో సుతారంగా మర్దన చేసుకుంటాం. తద్వారా చర్మానికి రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
చూశారుగా.. ఆయిల్ క్లెన్సింగ్ ప్రక్రియ వల్ల సౌందర్య పరంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో! పైగా ఇది చేసుకోవడం కూడా చాలా సులభం! అందుకే మనమూ మన చర్మతత్వాన్ని బట్టి నూనెల్ని ఎంచుకొని.. మెరిసిపోదాం. అయితే ఈ నూనెలు ఎంత సహజసిద్ధమైనవే అయినప్పటికీ ముఖానికి వాడే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం, వీటి విషయంలో మీకేవైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం మరీ మంచిది.