కాలమేదైనా అమ్మాయిలకు పలు చర్మ సమస్యలు మాత్రం కామన్. అందులో మొటిమలు, చర్మం పొడిబారిపోయి నిర్జీవమైపోవడం.. వంటివి ఈ కాలపు అమ్మాయిలను మరింతగా వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తక్షణమే తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీముల్ని రాసుకుంటారు చాలామంది. అది సమస్యను పెంచుకోవడమే తప్ప తగ్గించేందుకు అస్సలు ఉపయోగపడదు. అందుకే ఇలాంటి సమస్యల్ని తగ్గించుకొని తమ అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి తరతరాలుగా వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులపైనే ఆధారపడతారు శ్రీలంకన్ మహిళలు. అందుకే వారి లావణ్యాన్ని పొగడడానికి మాటలు సరిపోవు అనేది అక్కడి సౌందర్య నిపుణుల అభిప్రాయం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే శ్రీలంకన్ బ్యూటీగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అవడానికి సింహళ సుందరే అయినా.. తన సొగసు-సోయగంతో, నటనతో భారతీయులకు బ్యూటీ ఐకాన్‌గా మారిపోయిందీ సొగసరి. అలా జాక్వెలిన్ లాంటి అందాల తారలతో మిళితమైన శ్రీలంకన్ దేశపు మగువల సౌందర్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

మొటిమలకు అలొవెరా!
చర్మానికి చల్లదనాన్ని అందించడమే కాదు.. మోముపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని తగ్గించడంలో కలబందను మించిన ఔషధం మరొకటి లేదని చెప్పడంలో సందేహం లేదు. అందుకే దీన్ని వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇదే కలబందను శ్రీలంకన్ మగువలు తమ ముఖంపై ఏర్పడిన మొటిమల్ని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం వారు కలబందతో పాటు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను కలిపి ఒక ఫేస్‌ప్యాక్ తయారుచేసుకుంటారు. మూడు టేబుల్స్పూన్ల కలబంద గుజ్జుకు రెండు టేబుల్స్పూన్ల పసుపు, రెండు టేబుల్స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్ శెనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఇందులో మరికొంత రోజ్‌వాటర్ లేదంటే శెనగపిండి వేసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల పాటు ఉంచి ఆపై గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చని అంటున్నారు శ్రీలంకన్ మగువలు.

వైట్ హెడ్స్‌కి చెక్ పెట్టే వేప!
మన ఇళ్లల్లో పెంచుకునే చెట్లు చాలానే ఉంటాయి.. కానీ వేపచెట్లు మాత్రం ఎక్కడో ఒక చోట లేదంటే ఎవరో ఒకరింట్లో కనిపిస్తుంటుంది. కానీ శ్రీలంకలో మాత్రం ఇంటికో వేపచెట్టు (అక్కడ ఈ చెట్లును 'కొహొంబా'గా పిలుస్తారు) తప్పనిసరిగా ఉంటుందట. అందుకు సౌందర్య పరంగా అది అందించే ఔషధ గుణాలే కారణం. అక్కడి మగువలు వేపను వారి సౌందర్య పద్ధతుల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వైట్ హెడ్స్‌ని దూరం చేసుకోవడానికి, చర్మం పొడిబారి పోయి పగుళ్లు ఏర్పడినప్పుడు, ఎక్కడైనా గాయాలైనప్పుడు దీన్ని ఉపయోగించి సమస్యను తగ్గించుకోవడం అక్కడి వారికి అలవాటు. ఈ క్రమంలో రెండు టేబుల్స్పూన్ల వేప పొడిలో టేబుల్‌స్పూన్ కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసుకుంటారు. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని ఓ పది, పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వేపలోని యాంటీసెప్టిక్ గుణాలు పొడిబారిన చర్మాన్ని నయం చేయడంతో పాటు వైట్ హెడ్స్ సమస్యను కూడా దూరం చేస్తాయి.
ఛాయను పెంచుకోవడానికి..!
ముఖంపై సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల అక్కడ చర్మం కందిపోయినట్లు, చర్మ ఛాయ తగ్గినట్లుగా కనిపించడం సహజం. అలాంటి సమస్య ఎదురైనప్పుడు శ్రీలంకన్ అతివలు ఈ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ను ఉపయోగించి సమస్యను త్వరిత గతిన తగ్గించుకుంటారు. ఇందుకోసం నాలుగు టేబుల్స్పూన్ల కలబంద గుజ్జు, టేబుల్‌స్పూన్ కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ తేనె, రెండు టీస్పూన్ల నిమ్మరసం.. వీటన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకుంటారు. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్ల సహాయంతో ముఖానికి అప్త్లె చేసుకొని కాస్త మర్దన చేసుకుంటారు. అరగంటాగి కడిగేసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉండే నలుపు తగ్గి చర్మ ఛాయ ఇనుమడిస్తుందనేది సింహళ దేశపు మగువల అభిప్రాయం. అలాగే ఈ ఫేస్‌ప్యాక్ ద్వారా ముఖంపై ఏర్పడిన ముడతలు, గీతలు మటుమాయమవడంతో పాటు చర్మానికి తేమ కూడా అందుతుంది.

ఒత్త్తెన కనుబొమ్మలకు..
అందాన్ని పెంచడంలో కనుబొమ్మల పాత్ర కూడా కీలకమే. అవి ఒత్తుగా, నల్లగా ఉంటేనే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ ప్రయోజనాల్ని పొందడానికే శ్రీలంకన్ మగువలు నల్ల జీలకర్ర నూనెను ఆశ్రయిస్తుంటారు. ఆ నూనెను కనుబొమ్మలు, కనురెప్పలపై తరచూ రాసుకోవడం వల్ల అవి ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా కనిపిస్తాయని చెబుతున్నారు అక్కడి సౌందర్య నిపుణులు. అంతేకాదు.. ఈ నూనె చర్మానికి మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది. అందుకే దీంతో చర్మానికి మర్దన చేసుకుంటుంటారు సింహళ దేశపు అతివలు. తద్వారా ఈ నూనెలో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంలోకి ఇంకుతాయి. తద్వారా చర్మం మరింత మృదువుగా మారుతుంది.
ఇవి కూడా..!

* శ్రీలంకన్ బ్యూటీస్ తమ మేకప్‌ను తొలగించుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. అలాగే ఈ నూనెను బాడీ లోషన్‌గా కూడా వారు వాడతారు. ఇది చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుందనేది వారి అభిప్రాయం. * పెదాలపై ఉండే మృతచర్మాన్ని టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దడం ద్వారా తొలగించుకుంటారు సింహళీయులు. అలాగే బ్రౌన్ షుగర్, తేనె, కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని లిప్ స్క్రబ్‌గా ఉపయోగిస్తుంటారు. * ఎక్కువ నీళ్లు తాగడం, జ్యూసులు అధికంగా తీసుకోవడం కూడా తమ సౌందర్య రహస్యానికి ఓ కారణమే అంటారు అక్కడి అతివలు.
 * అందమంటే మోము అందంగా కనిపిస్తే చాలదు.. బాడీ కూడా ఫిట్‌గా ఉండాలనుకుంటారు సింహళ దేశపు మగువలు. అందుకే రోజూ క్రమం తప్పకుండా యోగా, బరువులెత్తడం, డ్యాన్సింగ్.. వంటి వ్యాయామాలు చేస్తుంటారు.
|
సింపుల్ హోమ్ రెమెడీస్‌తో తమ అందాన్ని పెంచుకుంటూ ఇతరులకు బ్యూటీ పాఠాలు నేర్పుతోన్న శ్రీలంకన్ మగువల సౌందర్య రహస్యాల గురించి తెలుసుకున్నారుగా! ఇంకా ఆలస్యమెందుకు.. మీరూ వీటిని ఫాలో అయిపోయి మరింత అందంగా మారిపోండి..