ఇలా కలిపితేనే ఫలితం!

నూనెలు జుట్టు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగపడతాయో మనకు తెలిసిందే. అయితే సోనమ్ చెప్పినట్లు వాటిని కలిపి వాడడం వల్ల పలు కేశ సంబంధిత సమస్యల్ని దూరం చేసుకొని జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అయితే ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే.. అత్యవసర నూనెల్ని నేరుగా వాడడం వల్ల వాటిలోని గాఢత కారణంగా కుదుళ్ల చర్మం దెబ్బతినే ఆస్కారం ఉందట! అందుకే కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె (లావెండర్, రోజ్, గ్రేప్‌ఫ్రూట్ మొదలైనవి)ను.. కొబ్బరి, ఆర్గాన్, ఆలివ్, జొజోబా, బాదం.. వంటి క్యారియర్ ఆయిల్స్ (తేలికపాటి నూనెల్లో)తో కలిపి వాడితే అత్యవసర నూనెల్లోని పోషకాలు కుదుళ్లకు అందడంతో పాటు కుదుళ్లు, జుట్టుకు ఎలాంటి నష్టమూ వాటిల్లదని సలహా ఇస్తున్నారు.. అలాగే రెండు, మూడు క్యారియర్ ఆయిల్స్ కలిపి వాడినా ఇదే ఫలితం పొందచ్చంటున్నారు. మరి ఈ క్రమంలో ఏయే నూనెల్ని కలిపి వాడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం..!
* హెయిర్‌స్టైలింగ్ టూల్స్, హెయిర్ డ్రయర్స్, జుట్టుకు రంగేయడం.. ఈ కాలపు అమ్మాయిలు పాటించే ఈ బ్యూటీ ట్రెండ్ కారణంగా జుట్టు తన సహజసిద్ధమైన తేమను కోల్పోయి పొడిబారుతుంది. తద్వారా జుట్టు గడ్డిలా, కళ తప్పినట్లుగా కనిపిస్తుంది. మరి, ఇలాంటి జుట్టుకు తిరిగి తేమనందించాలంటే అది బాదం నూనె, ఆలివ్ నూనె వల్లే సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఈ రెండు క్యారియర్ ఆయిల్స్‌ని కలిపి వాడడం వల్ల జుట్టుకు తేమగా మారడంతో పాటు సిల్కీగా మెరిసిపోతుంది.

* పెప్పర్మింట్, కొబ్బరి.. ఈ రెండు నూనెల్ని కలిపి వాడితే కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా లోలోపలి నుంచి కుదుళ్లు బలంగా మారి.. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాగే వెంట్రుకలకు తేమ కూడా అందుతుంది.
* చలికాలం చుండ్రు వేధించడం కామన్. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే లెమన్‌గ్రాస్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. వీటిని కలిపి జుట్టుకు, కుదుళ్లకు పట్టించి కాసేపు మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారం పది రోజులు తరచూ చేయడం వల్ల సత్వర పరిష్కారం దొరుకుతుంది. అలాగే చుండ్రు రావడానికి కుదుళ్లు తేమను కోల్పోవడం కూడా ఓ కారణమే! కాబట్టి తిరిగి తేమను అందించడంలో ఆర్గాన్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది.

* యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న టీట్రీ నూనె కుదుళ్లలో ఏర్పడిన అలర్జీని తొలగించడంలో సహకరిస్తుంది. గాఢత ఎక్కువగా ఉండే ఈ నూనెను నేరుగా కాకుండా ఆలివ్ నూనెలో కలుపుకొని వాడాల్సి ఉంటుంది. కొన్ని చుక్కల టీట్రీ నూనెను ఆలివ్ నూనెలో కలుపుకొని కుదుళ్లు, జుట్టుకు పట్టిస్తే కుదుళ్ల ఆరోగ్యం రెట్టింపవుతుంది. అలాగే జుట్టు తేమను సంతరించుకుంటుంది.
* జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేసే అద్భుత గుణాలు లావెండర్, జొజోబా ఆయిల్స్‌లో ఉన్నాయి. వీటిని కలిపి వాడితే కుదుళ్లలో కొత్త కణాలు ఉత్పత్తయి తద్వారా వెంట్రుకలు బలంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. అలాగే లావెండర్ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కుదుళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తాయి. అయితే ఈ క్రమంలో క్యారియర్ ఆయిల్ అయిన జొజోబా నూనెలో కొన్ని చుక్కల లావెండర్ నూనె (అత్యవసర నూనె) కలిపి వాడుకోవాల్సి ఉంటుంది.
|