కొంతమంది చేతులు మామూలుగానే పొడిబారినట్లు కనిపిస్తుంటాయి. ఇటువంటివారు చలికాలంలో మరింత ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. శీతల గాలుల ప్రభావం కారణంగా చర్మం మరింత పొడిబారి, నిర్జీవంగా మారి పొట్టు రాలుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్‌లను ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఆ స్క్రబ్‌లు ఏంటో మనమూ చూద్దాం రండి..
సాధారణంగా అమ్మాయిల చేతులు చాలా లేతగా, మృదువుగా ఉంటాయి. అయితే చర్మంలోని తేమ స్థాయి తగ్గడం, రసాయనాల ప్రభావానికి ఎక్కువగా గురికావడం.. వంటి కారణాల వల్ల కొంతమందిలో చేతులపై చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. అయితే సహజసిద్ధమైన స్క్రబ్స్ ఉపయోగించి ఈ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు.

అవకాడో+ తులసి..
అవకాడో చర్మానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలిసిందే. చేతులను అందంగా మార్చేందుకూ దీన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం మెత్తగా చేసుకున్న అవకాడో గుజ్జులో కొద్దిగా తులసి ఆకుల రసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు పట్టించాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే తగినంత తేమ అందడం వల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది.

చక్కెర..
చక్కెర మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే. దీన్ని చేతులకూ ఉపయోగించవచ్చు. అయితే రుద్దేటప్పుడు కాస్త సున్నితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా చక్కెర తీసుకొని కొన్ని చుక్కల నీటిని కలిపి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చేతులపై మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున క్రమంతప్పకుండా చేయడం ద్వారా కోమలమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

కలబంద గుజ్జు..
కలబంద గుజ్జు చర్మంలో తేమశాతం తగ్గకుండా కాపాడుతుంది. దీన్ని చేతులకు ఉపయోగించేందుకు కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని అందులో కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చేతులపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి సహజసిద్ధమైన మెరుపుతో పాటు తేమని కూడా అందిస్తాయి. ఫలితంగా మృదువైన, అందమైన చర్మం సొంతం చేసుకోవచ్చు.

సీ సాల్ట్ + ఆలివ్ ఆయిల్..
రెండు చెంచాల ఆలివ్‌నూనెలో చెంచా సీసాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పొడిబారిన చర్మం ఉన్నచోట మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది. ఈ చిట్కాని వారానికి ఒకటి లేదా రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా అనుసరిస్తే మరిన్ని మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

స్ట్రాబెర్రీ + తేనె..
తేనె చర్మానికి చక్కటి మృదుత్వాన్ని అందిస్తుంది. మరి, దీన్ని చేతులకు ఉపయోగించడం కోసం బాగా పండిన స్ట్రాబెర్రీ ఒకటి తీసుకొని దానిని మెత్తగా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల తేనె వేసి బాగా కలిపి ఈ పేస్ట్‌ని పొడిబారిన చర్మం ఉన్నచోట అప్త్లె చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకొని తర్వాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా మృదువైన, కోమలమైన చర్మం మన సొంతం చేసుకోవచ్చు.

కీరాదోస + జోజోబా ఆయిల్..
ముందుగా కీరాదోస తొక్క చెక్కి దానిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న కీరాదోస గుజ్జు రెండు చెంచాలు తీసుకొని అందులో అరచెంచా (6- 7 చుక్కలు) జోజోబా ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పొడిబారిన చర్మంపై మృదువుగా ఐదు నిమిషాల పాటు రుద్దుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

వీటినీ ఉపయోగించవచ్చు..
పొడిబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చడానికి, చేతులను మృదువుగా ఉంచడానికి కేవలం పైన చెప్పుకున్న పదార్థాలే కాదు.. మిల్క్ క్రీమ్, ఆర్గాన్ ఆయిల్, వరిపిండి, పెరుగు, మయోనైజ్, కాఫీ పొడి, బాదం నూనె, క్యారట్, పుదీనా రసం.. మొదలైనవి కూడా ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలన్నీ కేవలం చేతులకే కాదు.. ముఖం, మెడపై కూడా ప్యాక్స్‌లా అప్త్లె చేసుకున్నా ఆశించిన ఫలితం పొందచ్చు.
చూశారుగా.. చలికాలంలోనూ మృదువైన, కోమలమైన చేతులు పొందాలంటే మనం ఉపయోగించాల్సిన సహజసిద్ధమైన స్క్రబ్స్ ఏంటో.. మీరూ వీటిని ఒకసారి ప్రయత్నించి చూడండి మరి!