
అందమంటే.. కేవలం ముఖం, జుట్టుని సంరక్షించుకుంటే సరిపోదు.. చేతులు, కాళ్లు, పాదాల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే సంపూర్ణ సౌందర్యం ఇనుమడిస్తుంది. అయితే పాదాలే కదా.. అని చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తద్వారా వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి పాదాలపైకి చేరి అక్కడి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తున్నాయి. ఫలితంగా పాదాలు, మడమలపై మృతకణాలు పెరిగిపోయి ఆనెలు ఏర్పడడం, చర్మం వూడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా ఈ చలికాలంలో చాలామంది మహిళలకు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. మరి, ఇలాంటి పాదాలు, మడమల సమస్యల్ని తగ్గించుకొని వాటి అందాన్ని సంరక్షించుకోవడానికి ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. ఇంతకీ అవేంటి? పాదాల అందం, ఆరోగ్యం విషయంలో అవెలా ఉపయోగడతాయి? రండి.. తెలుసుకుందాం..

కాలస్ రిమూవర్ టూల్
వాతావరణంలోని దుమ్ము-ధూళి, కాలుష్యం.. చర్మ రంధ్రాల్లోకి చేరి.. తద్వారా చర్మంపై మృతకణాలు ఏర్పడడం మనకు తెలిసిందే. అయితే కేవలం ముఖ చర్మంపైనే కాదు.. పాదాలు, మడమల్లోనూ మృతకణాలు ఏర్పడతాయి. అవి పెరిగిపోయి కొన్నాళ్లకు ఆనెలుగా మారడం, ఆ ప్రదేశంలో తీవ్ర నొప్పి వేధించడం.. ఇలాంటి పరిస్థితిని మనలో చాలామంది ఎదుర్కొనే ఉంటారు. అయితే వాటిని తొలగించుకోవడానికి ఇప్పుడు క్రీములు, మందులతో పనిలేదు. ఎందుకంటే ఆనెల్ని సులభంగా తొలగించేందుకు 'కాలస్ రిమూవర్ టూల్' ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరింది. ఫొటోలో చూపించినట్లుగా షేవర్లాగా ఉండే ఈ రిమూవర్కు పైవైపున మృదువైన రోలర్ ఉంటుంది. దీనికి కింది వైపున ఉండే హ్యాండిల్‌పై ఒక చిన్న బటన్ ఉంటుంది. బ్యాటరీస్తో పనిచేసే ఈ రోలర్ని ఉపయోగించాలంటే ముందుగా బటన్ని నొక్కి.. ఆపై ఆనెలు ఉన్న భాగాల్లో మృదువుగా రోల్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల త్వరలోనే ఆనెల నుంచి ఉపశమనం లభిస్తుంది. కేవలం ఈ సమస్యే కాదు.. పొడిబారి పగుళ్లు ఏర్పడిన మడమల్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి సైతం ఈ కాలస్ రిమూవర్ టూల్ ఉపయోగపడుతుంది. ఈ రిమూవర్ డిజైన్, నాణ్యతను బట్టి దీని ధర రూ. 399 నుంచి రూ. 1,180 వరకు ఉంది.

మల్టీ యూజ్ పెడిక్యూర్ ప్యాడెల్
సాధారణంగా పగిలిన మడమల్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే దీంతో పాదాలపై, కాలి వేళ్ల మధ్య భాగాల్లో పేరుకున్న మృతకణాల్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే పాదాల్ని, మడమల్ని పూర్తిస్థాయిలో సంరక్షించుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరింది 'మల్టీ యూజ్ పెడిక్యూర్ ప్యాడెల్'. పేరుకు తగినట్లుగానే ఈ ప్యాడెల్తో వివిధ రకాలుగా పాదాల్ని సంరక్షించుకోవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా ఓవల్ షేప్‌లో ఉండే దువ్వెన మాదిరిగా ఉండే ఈ ప్యాడెల్కు ఒకవైపు అపోజిట్‌గా ప్యూమిస్ స్టోన్, మృదువైన బ్రిజిల్స్.. మరోవైపు అపోజిట్‌గా కాస్త గరుకుగా, మృదువుగా ఉండే ఉపరితలాలుంటాయి. ప్యూమిస్ స్టోన్ పగిలిన మడమలకు పరిష్కారం చూపితే.. మృదువైన బ్రిజిల్స్ సహాయంతో వేళ్ల మధ్య భాగాలను మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే రెండోవైపు ఉన్న మృదువైన ఉపరితలాలతో అరికాళ్లు, పాదాలపై సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేసుకోవచ్చు. ఫలితంగా ఆయా భాగాల్లో రక్తప్రసరణ సక్రమంగా సాగుతుంది. ఇలా ఒకేసారి వివిధ పనులు చేసే ఈ ప్యాడెల్ నాణ్యతను బట్టి దీని ధర రూ. 90 నుంచి రూ. 278 వరకు ఉంది.

ఫుట్ క్లెన్సర్ షవర్ స్లిప్పర్
పాదాలపై ఉండే చర్మం దగ్గర్నుంచి మడమల్లో పగుళ్ల వరకు అన్ని పనులు ఒకేసారి పూర్తయితే బాగుంటుంది కదా.. అని ఆలోచిస్తున్నారా? అందుకే మీ ఆలోచనలకు తగ్గట్లే ప్రస్తుతం 'ఫుట్ క్లెన్సర్ షవర్ స్లిప్పర్' మార్కెట్లో సందడి చేస్తోంది. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం ఫుట్‌వేర్ మాదిరిగానే ఉండే ఈ స్లిప్పర్‌కి అడుగున మృదువైన పొడవాటి బ్రిజిల్స్ ఉంటాయి. పైవైపున కూడా కర్వీలా ఉండి.. దాని కిందికి పొడవైన బ్రిజిల్స్ వేలాడదీసినట్లుగా ఉంటాయి. మడమ భాగంలో ప్యూమిస్ స్టోన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ స్లిప్పర్లో కాలు పెట్టి.. పై నుంచి ఫుట్ వాష్ లిక్విడ్‌ను పోస్తూ కాలును ముందుకూ, వెనక్కీ జరుపుతుండాలి. ఈ క్రమంలో బ్రిజిల్స్ పాదాలు, అరికాళ్లలోని చర్మాన్ని శుభ్రం చేస్తే.. ప్యూమిస్ స్టోన్ మడమల్లోని పగుళ్లను తొలగిస్తుంది. ఇలా పెద్దగా శ్రమ పడకుండా ఒకేసారి పాదాల్ని శుభ్రం చేసుకోవచ్చు. ఈ స్లిప్పర్ నాణ్యతను బట్టి దీని ధర రూ. 249 నుంచి రూ. 590 వరకు ఉంది.

వుడెన్ ఫుట్ మసాజర్
చర్మాన్ని మసాజ్ చేసినప్పుడు రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మ ఆరోగ్యం పెంపొందుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ పద్ధతి కేవలం ముఖం, ఇతర శరీర భాగాలకే కాదు.. పాదాలకూ వర్తిస్తుంది. అయితే అందులోనూ అరికాళ్లను మసాజ్ చేసుకోవాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే అని చెప్పుకోవాలి. అలాంటి కష్టతరమైన పద్ధతిని మరింత ఈజీ చేసేసింది 'వుడెన్ ఫుట్ మసాజర్'. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం పీటలాగా ఉండే దీనికి మధ్యలో మృదువైన బొడిపెల్లా ఉండే రెండు రోలర్స్ ఉంటాయి. ఇక రెండు చివర్లలో గుండ్రటి బాల్స్ రోలర్స్లా అమరి ఉంటాయి. ఈ పీటపై రెండు పాదాలు పెట్టుకునేలా అమరిక ఉంటుంది. ఇప్పుడు పాదాల్ని ఈ మసాజర్పై ఉంచి ముందుకూ, వెనక్కీ అనడం వల్ల అరికాళ్లకు చక్కటి మసాజ్ అందుతుంది. అలాగే బాల్స్ ద్వారా మడమలకు మసాజ్ అవుతుంది. ఇలా ఫుట్ మసాజ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఈ మసాజర్ డిజైన్, నాణ్యతను బట్టి దీని ధర రూ. 166 నుంచి రూ. 449 వరకు ఉంది.

ఫుట్ స్పా బాత్ మసాజర్
పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తరచూ పెడిక్యూర్ చేయించుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో స్పా సెంటర్లను ఆశ్రయించే వారు కొందరైతే.. ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతుల్ని పాటించే వారు మరికొందరు. మరి, ఇంట్లోనే స్పా సెంటర్లలో పెడిక్యూర్ చేయించుకున్న ఫీలింగ్ కలగాలంటే అందుకు 'ఫుట్ స్పా బాత్ మసాజర్' చక్కగా ఉపయోగపడుతుంది. ఫొటోలో చూపించినట్లుగా చిన్న టబ్ మాదిరిగా ఉండే ఇందులో అడుగున మృదువైన రోలర్స్ ఉంటాయి. దీనిలో పాదాలు మునిగే వరకు నీళ్లు నింపి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. కాస్త వేడయ్యాక.. స్విచ్ ఆఫ్ చేసి.. ఆ నీటిలో అవసరమైతే అరోమా నూనెల్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు పాదాల్ని అందులో పెట్టి.. ముందుకూ, వెనక్కీ అంటూ ఉండాలి. తద్వారా అరికాళ్లకు మసాజ్ అవడంతో పాటు.. పాదాలకు చక్కటి రిలాక్సేషన్ అందుతుంది. ఇలా ఇంట్లోనే పాదాలకు ఈజీగా స్పా ట్రీట్మెంట్ చేయచ్చు. ఈ స్పా బాత్ మసాజర్ డిజైన్, నాణ్యతను బట్టి దీని ధర రూ. 1,795 నుంచి రూ. 3,850 వరకు ఉంది.
Photos: Amazon.in