గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటిలో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చల్లాగా వచ్చే ఈ సమస్య వల్ల ముఖం నిర్జీవమైపోయినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయో అన్న భయం కాబోయే తల్లుల్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని డాక్టర్ సలహా మేరకు వాటిని వాడితే ఈ సమస్య నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది.
1. ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజులకు సమస్య తగ్గిపోతుంది.
2. టొమాటో రసం, కీరా రసం సమపాళ్లలో తీసుకొని దానికి కొద్దిగా పాలు కలిపి ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది అన్ని చర్మతత్వాల వారికి సరిపోతుంది.

3. ఎలాంటి చర్మ సమస్యనైనా తగ్గించే శక్తి కలబందకు ఉందనడంలో సందేహం లేదు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే పిగ్మెంటేషన్‌ను కూడా సమూలంగా తొలగిస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వారం రోజుల్లోనే మీ ముఖంలో తేడా మీరు గమనించచ్చు.
4. పిగ్మెంటేషన్‌తో నిర్జీవమైపోయిన చర్మాన్ని విటమిన్-ఇ నూనెతో కూడా మెరిపించవచ్చు. సమస్య ఉన్న చోట ఈ నూనెను అప్త్లె చేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజులకు పిగ్మెంటేషన్ కనుమరుగవుతుంది.
5. రెండు బాదంపప్పులు, టీస్పూన్ తేనె.. ఈ రెండూ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గడమే కాదు.. దాని వల్ల అక్కడ నిర్జీవమైన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

6. గంధం, పసుపు సమపాళ్లలో తీసుకొని దానికి పాలను కలుపుతూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌తో నిర్జీవమైన చర్మంపై రాసి అరగంట పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోవాలి. తద్వారా చక్కటి ఫలితం కనబడుతుంది.
7. సన్నగా తురిమిన బంగాళాదుంప గుజ్జుకు కాస్తంత నిమ్మరసం కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను రోజూ సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే క్రమంగా సమస్య తగ్గుముఖం పడుతుంది.
8. గుప్పెడు పుదీనా ఆకులకు నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని పావుగంట తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. పిగ్మెంటేషన్ బారి నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలంటే రోజుకు రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

9. టేబుల్‌స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకొని ఈ మూడింటినీ మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.
10. టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు తీసుకొని అందులో రెండు టేబుల్స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్‌లాగా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుంది.

11. కమలాఫలం తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో పచ్చి పాలను చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకొని ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న0 చోట అప్త్లె చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడడమే కాదు.. చర్మ రంగు కూడా మెరుగుపడుతుంది.
12. రెండు టేబుల్స్పూన్ల ఓట్మీల్, అర టేబుల్‌స్పూన్ టొమాటో రసం, టేబుల్‌స్పూన్ పెరుగు.. ఈ మూడింటిని కలుపుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. టొమాటోలోని సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు చర్మాన్ని శుభ్రపరిస్తే, ఓట్మీల్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి సమస్యను తగ్గిస్తుంది. పెరుగు ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.
13. సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు ఎస్పీఎఫ్ 30 సన్‌స్క్రీన్ రాసుకోవడం, ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం మాత్రం మరవద్దు.

14. అలాగే పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించడం అవసరం. దానిమ్మ, బెర్రీస్, నట్స్, బొప్పాయి.. వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాలతో పాటు కివీ, నిమ్మ, స్ట్రాబెర్రీ, కమలాఫలం, ద్రాక్ష, క్రాన్బెర్రీస్.. వంటి విటమిన్-సి అధికంగా లభించే పండ్లను కూడా రోజూ తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి కూడా అవసరమే.
గర్భధారణ సమయంలో పిగ్మెంటేషన్ని దూరం చేయడానికి ఎలాంటి సహజసిద్ధమైన పదార్థాల్ని ఉపయోగించాలో తెలుసుకున్నారుగా! అయితే ఇవి సహజసిద్ధమైనవే అయినా ఒక్కోసారి ఇందులో కొన్ని పదార్థాలు అన్ని చర్మతత్వాల వారికి సరిపడకపోవచ్చు. తద్వారా అలర్జీల బారిన పడే అవకాశముంది. కాబట్టి వీటిని వాడే ముందు ఓసారి మీరు తరచూ చెక్ చేయించుకునే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.