పండగైనా, ప్రత్యేక సందర్భమైనా అమ్మాయిల మనసు అందం మీదకే మళ్లుతుంది. రోజూ కనిపించే కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటారు అతివలు. అందుకే పార్లర్లు, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో బయటికి వెళ్లడం కంటే ఇంట్లోనే అందాన్ని సంరక్షించుకోవడం సురక్షితం! అది కూడా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో అయితే వందల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మరి, ఈ పండగలు, పెళ్లిళ్ల సీజన్లో ఇంటి పట్టునే ఉంటూ అందాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..
ప్రస్తుతం ఈ శీతల వాతావరణం అమ్మాయిల అందాన్ని ప్రశ్నార్థకం చేస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారడం, తద్వారా దురద, మంట.. ఇక ఆ సమస్యల గురించి వేరే చెప్పక్కర్లేదు. మరి, ఇలాంటి సౌందర్య సమస్యల్ని తొలగించుకుంటూనే ఈ పండగ సీజన్లో ముఖ కళను పెంచుకోవాలంటే సహజసిద్ధమైన ఈ ఫేస్‌ప్యాక్స్ ప్రయత్నించాల్సిందే!

అరటిపండు-పాలతో..
మనలో చాలామంది ఇంట్లో బాగా పండిన అరటిపండ్లు తినడం ఇష్టం లేక పడేస్తుంటారు. కానీ అలా బాగా మగ్గిన అరటిపండు అందాన్ని ఇనుమడింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ఒక బౌల్లో కొద్దిగా అరటిపండును గుజ్జులా చేసి అందులో కొన్ని పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి ఒక పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆపై ఈ ప్యాక్ ఆరిపోయేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. తద్వారా చర్మం పొడిబారే సమస్య నుంచి బయటపడచ్చు.

కీరాతో కళగా!
ఏ కాలమైనా మనల్ని వేధించే సమస్య మొటిమలు, మచ్చలు. వీటివల్ల ఎంత ప్రకాశవంతంగా ఉన్న ముఖమైనా డల్‌గా కనిపించడం కామన్. మరి అలాంటప్పుడు ఆ సమస్యను అలాగే వదిలేయకుండా కీరాదోసను ప్రయత్నించి చూడండి. ఇందుకోసం కీరాను చిన్న చిన్న సన్నటి స్లైసుల్లా కట్ చేసి ఓ గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఆ తర్వాత వాటిని ముఖంపై పరచుకొని, కళ్లపై పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు సేదదీరండి. ఇప్పుడు స్లైసులు తొలగించి చల్లటి నీటితో ముఖం కడిగేసుకుంటే అలసట ఇట్టే మాయమై చర్మం తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది.

మృదువైన చర్మానికి కలబంద!
కలబంద చర్మానికి తేమను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో టేబుల్‌స్పూన్ కలబంద గుజ్జులో, రెండు టేబుల్స్పూన్ల వెన్న, చిటికెడు పసుపు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖం, మెడపై అప్లై చేసుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా రోజుకోసారి చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ముఖం మృదువుగా మారడాన్ని గమనించచ్చు.

మృతకణాల్ని దూరం చేసే కాఫీ ప్యాక్!
చల్లటి వాతావరణంతో పాటు కాలుష్యం, దుమ్ము-ధూళి.. వంటివి కూడా అమ్మాయిల అందానికి అడ్డంకులుగా మారుతున్నాయి. ఇక ఇవి చర్మ రంధ్రాల్లోకి చేరి మృతకణాలు, మచ్చలు పడడానికి కారణమవుతాయి. వీటి బెడద తగ్గాలంటే కాఫీతో చేసిన ఈ ఫేస్‌ప్యాక్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కాస్త బరకగా ఉన్న కాఫీ పొడిలో కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆపై అరగంట పాటు అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఏర్పడిన మృతకణాలు, మచ్చలు మటుమాయమవుతాయి. అలాగే కాఫీ చర్మానికి సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేసి చక్కటి గ్లోని అందిస్తుంది.

జుట్టు పైనా శ్రద్ధ పెట్టాల్సిందే!
అందమంటే కేవలం ముఖమే కాదు.. జుట్టు కూడా! అయితే ఈ చలికాలంలో జుట్టు పొడిబారిపోయి గడ్డిలా కనిపిస్తుంటుంది. దాంతో అందం దెబ్బతింటుంది. అయితే ఇందుకోసం తేనెతో తయారుచేసిన ఈ హెయిర్ మాస్క్ చక్కగా పనిచేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. అరకప్పు చిక్కటి పాలు తీసుకొని అందులో రెండు టీస్పూన్ల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. పాలు, తేనె జుట్టు తేమను కోల్పోకుండా కాపాడతాయి.
ఇవి గుర్తుంచుకోండి!

* ముఖంతో పాటు చర్మాన్నీ మెరిపించుకోవాలనుకున్న వారు రోజూ ఇంట్లో తయారుచేసిన ఈ బాడీ ప్యాక్‌ను ఉపయోగించడం మంచిది. ఒక బౌల్ శెనగపిండి, అరకప్పు పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపుతో తయారుచేసిన బాడీ ప్యాక్ చర్మానికి తక్షణ మెరుపును అందిస్తుంది. * ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ మజాయే వేరు కదండీ! కానీ ఈ వేడినీళ్లు మన అందాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. ఇవి మన చర్మంలోని సహజసిద్ధమైన నూనెల్ని తొలగించి చర్మం మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి ఈ కాలంలో గోరువెచ్చటి నీళ్లు, వీలైతే చల్లటి నీళ్లతోనే స్నానం, ముఖం శుభ్రం చేసుకోవడం మంచిదట! * ఇక ముఖం కడుక్కున్న ప్రతిసారీ సబ్బులు వాడకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సబ్బుల్లో ఉండే రసాయనాలు చర్మాన్ని గరుకుగా మార్చుతాయి. కాబట్టి మధ్యమధ్యలో ముఖం కడుక్కున్నా చల్లటి నీటితో ఏ సబ్బూ ఉపయోగించుకోకుండానే శుభ్రం చేసుకోవడం మంచిది.
|
ఇక వీటితో పాటు నీళ్లు తాగడం, చక్కటి పోషకాహారం తీసుకోవడం, సరిపడా నిద్ర పోవడం మనకు తెలిసిందే! అయితే ఈ కాలంలో కొంతమంది చర్మం మరీ పొడిబారిపోయి రక్తం కారుతుంటుంది. అలాంటి సమస్య మీకున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా ముందు సంబంధిత నిపుణుల్ని సంప్రదించండి. తద్వారా సమస్యకు పరిష్కారం తెలుసుకొని అందాన్ని సంరక్షించుకోండి.. ఈ పండగలు, శుభకార్యాల సీజన్లో మరింత బ్యూటిఫుల్‌గా మెరిసిపోండి!