అందంగా కనిపించాలని అనుకోని అమ్మాయిలెవరుంటారు చెప్పండి? అందుకే ముఖసౌందర్యంలో కళ్లను హైలైట్ చేసుకోవడానికి కనుబొమ్మలను కూడా చక్కటి ఆకృతిలో తీర్చిదిద్దుకుంటారు. అయితే ఈ కనుబొమ్మలు కొందరికి పలుచగా ఉంటే, మరికొందరికి దళసరిగా ఉంటాయి. మరి, కనుబొమ్మలు సహజంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
* కొబ్బరి పాలని కనుబొమ్మలకు రాయడం ద్వారా అవి దళసరిగా పెరుగుతాయి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్నాళ్లకు చక్కటి ఫలితం ఉంటుంది.
* రోజూ కాస్తంత ఆముదాన్ని నిద్రపోయే ముందు కనుబొమ్మల చుట్టూ రాయండి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. ఇది పాత చిట్కానే అయినా చాలా చక్కగా పనిచేస్తుంది.
* కొబ్బరి నూనె పెట్టడం వల్ల కూడా కనుబొమ్మలు బాగా పెరుగుతాయి.
* రాత్రి నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే పేస్ట్ చేసి కనుబొమ్మలపై రాయాలి. ఇలా చేయడం వల్ల ఫలితం కొద్ది రోజుల్లోనే కనబడుతుంది.

* కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే వాటిల్లో కలబంద కూడా ఒకటి. కలబంద ఆధారిత జెల్స్ ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాగే, ఇంట్లో కలబంద మొక్క ఉన్నట్లయితే, దాని రెమ్మను తుంచి అందులో ఉన్న జెల్‌ను కనుబొమ్మల చుట్టూ రాస్తే సరి..
* పాలు.. ఇవి కూడా అందరికీ అందుబాటులో ఉండేవే. కాసిన్ని పాలలో కాటన్‌ను ముంచి కనుబొమ్మల చుట్టూ రుద్దాలి.
* కనుబొమ్మలపై నిమ్మ చెక్కతో రుద్దినా ఆ ప్రదేశంలో వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి.
* పెట్రోలియం జెల్లీ రాయడం వల్ల కనుబొమ్మలకు పూర్తి తేమ అందడమే కాకుండా అవి దృఢంగా ఉండటానికి కూడా ఉపకరిస్తుంది. దీని వల్ల పలుచగా మారిన కనుబొమ్మలు మరింత పలుచగా అవకుండా ఉంటాయి. ఒకవేళ కనుబొమ్మలు మాటిమాటికీ వూడిపోతుంటే రోజుకు 2 నుంచి 3 సార్లు కొద్దిగా పెట్రోలియం జెల్లీని రాసుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
* ఆలివ్ నూనె, బాదం నూనె కూడా కనుబొమ్మల ఎదుగుదలకు చాలా మంచివి. ఇవి కనుబొమ్మల వెంట్రుకలకు కావాల్సిన దృఢత్వాన్ని అందించి అవి ఊడిపోకుండా చేస్తాయి. తద్వారా ఐబ్రోస్ దళసరిగా కనిపిస్తాయి.
* ఇక అన్నిటికంటే సులభంగా దొరికేది ఉల్లిపాయ.. ఇందులో సల్ఫర్ అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి అది రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మల చుట్టూ రాయడం వల్ల ఒత్త్తెన కనుబొమ్మలను పొందవచ్చు.
* విటమిన్స్ లోపం వల్ల కూడా వెంట్రుకల ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ‘బి’, ‘సి’, ‘ఇ’.. వంటి విటమిన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలి. అలాగే వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడచ్చు.
* ఈ చిట్కాలతో పాటు రోజూ తగినంత నీరు తాగాలి. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవడమే కాకుండా రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది.