‘బంతి పూల జానకీ జానకీ..’ అంటూ అమ్మాయిల సొగసును బంతిపువ్వుతో పోల్చాడో సినీ కవి. కేవలం పోలికలోనే కాదు.. అందాన్ని పెంపొందించడంలోనూ ఈ పువ్వుకు సాటి మరొకటి లేదనడం అతిశయోక్తి కాదు..! బంతి పువ్వు వర్ణానికి తగినట్లుగానే.. మన మేనికి బంగారు ఛాయను అందిస్తుందంటున్నారు నిపుణులు. వీటితో తయారుచేసిన కొన్ని ఫేస్‌ప్యాక్స్ అటు పలు చర్మ సమస్యల్ని తగ్గిస్తూనే.. ఇటు మెరుపునూ అందిస్తాయట! మరి, ప్రస్తుతం బంతిపూలు అధికంగా దొరుకుతోన్న ఈ కాలంలో ఈ పువ్వుతో చర్మాన్ని ఎలా మెరిపించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
* మొటిమలు, కాలిన గాయాలు, దురద.. వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారా?? అయితే మీ సౌందర్య ఉత్పత్తుల్లో బంతి పువ్వును కూడా చేర్చేయండి. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్.. మొదలైన గుణాలు ఎలాంటి చర్మ సమస్యలనైనా నయం చేస్తాయి.
* చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయా?? అయితే బంతి పువ్వు పేస్ట్‌ను ముఖానికి, శరీరానికి రుద్దుకోవాలి. దీంతో శరీరంలో కొలాజెన్ ఉత్పత్తయి క్రమంగా ముడతలు తగ్గిపోయి నవయవ్వనం మీ సొంతమవుతుంది.
* బంతి పువ్వు చర్మానికి సహజసిద్ధమైన తేమను, మెరుపును ఇస్తుంది.
* అలాగే ఇది జుట్టును పట్టులా చేయడంలో, చుండ్రును నివారించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా వాపు, తలనొప్పి నివారణకు కూడా బంతి పువ్వు తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీసెప్టిక్ గుణాల వల్ల క్రిమికీటకాలు కుట్టినప్పుడు నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.

జిడ్డు చర్మమా??
ఏ కాలంలో అయినా జిడ్డు చర్మం చాలామందిని వేధించే సమస్య. జిడ్డును అదుపు చేసుకోవడానికి ఎన్ని సబ్బులు వాడినా, క్రీములు రాసినా ఫలితం లేకపోతే సింపుల్‌గా ఈ ప్యాక్ ప్రయత్నించి చూడండి.
కావలసిన పదార్థాలు
* మెత్తగా చేసిన బంతి పూవు రెక్కలు
* ఉసిరి పొడి - అర చెంచా
* పెరుగు - అర చెంచా
* నిమ్మరసం - ఆరు చుక్కలు
తయారీ విధానం
ముందుగా ఉసిరి కాయల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దానిలో నుంచి అర చెంచా ఉసిరి పొడిని తీసుకుని మెత్తగా చేసి పెట్టుకున్న బంతి పూవు రెక్కలకు కలుపుకోవాలి. తర్వాత ఐదారు చుక్కల నిమ్మరసం కూడా ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మరింత మృదుత్వం రావడానికి అరచెంచా పెరుగును కూడా కలుపుకోవాలి. పెదాలను, కళ్ల కింద భాగాన్ని వదిలేసి ముఖమంతా ఈ పేస్టును రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత కడిగేసుకుంటే ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. అలాగే ఇందులో మనం ఉపయోగించిన పెరుగు వల్ల చర్మం శుభ్రపడి, కాంతివంతంగా తయారవుతుంది. నిమ్మరసం మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చల్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఉసిరి పొడి వల్ల చర్మ కణాలు బిగుతుగా తయారై చర్మం నవయవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

చర్మం పొడిగా తయారవుతోందా??
శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్య.. చర్మం పొడిబారిపోవడం. కానీ కొంతమందికైతే ఎప్పుడు చూసినా చర్మం పొడిగానే ఉంటుంది. దీంతో చర్మం పొట్టులాగా వూడిపోవడం, అలర్జీ.. ఇలా రకరకాల చర్మ సంబంధ సమస్యలు వేధిస్తుంటాయి. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగి చర్మం తేమగా మారాలంటే ఈ ఫేస్‌ప్యాక్‌ను ప్రయత్నించవచ్చు.
కావలసిన పదార్థాలు
* బంతి పువ్వు రెక్కలు
* శెనగపిండి - అర చెంచా
* పాల మీగడ - ఒక చెంచా
* తేనె - ఐదారు చుక్కలు
తయారీ విధానం
బంతి పువ్వు రెక్కల్ని మెత్తగా చేసుకోవాలి. దానిలో పాల మీగడ, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శెనగపిండిలో వేసి మృదువుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పెదాలు, కళ్ల కింద భాగం తప్ప ముఖమంతా ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత తడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం తేమను సంతరించుకుంటుంది. ఇందులో మనం ఉపయోగించిన పాల మీగడ, తేనె వల్ల చర్మం తేమగా, మృదువుగా తయారవుతుంది. శెనగపిండి వల్ల చర్మం శుభ్రపడుతుంది.

కాంబినేషన్ చర్మమైతే..
ఇలాంటి చర్మతత్వం గలవారి చర్మం అటు పూర్తిగా పొడిగా కాకుండా, ఇటు జిడ్డుగా కాకుండా.. ఈ రెండింటి కలయికతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి వారి కోసమే ఈ ప్యాక్..
కావలసిన పదార్థాలు
* బంతి పువ్వు రెక్కలు
* గంధం పొడి - అర చెంచా
* పెరుగు - అర చెంచా
తయారీ విధానం
బంతిపువ్వు రెక్కల పేస్ట్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి. దానిలో పెరుగు, గంధం పొడి వేసి మృదువైన పేస్ట్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు, కంటి కింద భాగానికి అంటుకోకుండా మిగిలిన ముఖ భాగమంతా రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను కూడా ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకుని గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం తేమగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో మనం వాడిన గంధం వల్ల చర్మ కణాలు బిగుతుగా తయారవుతాయి. పెరుగు చర్మాన్ని మరింత పరిశుభ్రంగా చేయడంలో తోడ్పడుతుంది.
గుర్తుంచుకోవాల్సినవి..
* గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు బంతి పువ్వు ప్యాక్‌లు వాడకూడదని నిపుణుల అభిప్రాయం.
* ఫేస్‌ప్యాక్ వేసుకునేటప్పుడు కంటి కింద భాగంలో, పెదాలకు ప్యాక్ తగలనివ్వకుండా జాగ్రత్తపడాలి.