మేని మెరుపును సొంతం చేసుకోవడానికి మీరు చేయని ప్రయత్నమంటూ లేదా? జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి రకరకాల సబ్బులు వాడుతున్నారా? మొటిమల్ని నివారించుకోవడానికి పలు రకాల క్రీమ్‌లు రాసుకుంటున్నారా? అయితే మీ వంటగదినే బ్యూటీపార్లర్లా మార్చుకుంటే మీ సమస్యలన్నింటినీ ఇట్టే అధిగమించేయచ్చు. ఏంటీ.. ఆశ్చర్యపోతున్నారా? మేం చెప్పేది నిజమేనండీ.. మీ వంటగదిలో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఫేస్‌ప్యాక్స్ వాడితే ఇలాంటి చర్మ సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. మరి వాటిలో కొన్నిటి గురించి చూడండి..
గుమ్మడితో గుబాళించే అందం..

కావాల్సినవి
* బాగా పండిన గుమ్మడి పండు గుజ్జు - 2 చెంచాలు
* తేనె - అర చెంచా
* పాలు - అర చెంచా
* దాల్చినచెక్క పొడి - పావు చెంచా
తయారీ విధానం
ముందుగా గుమ్మడి పండు గుజ్జును ఒక పాత్రలో తీసుకోవాలి. దీనిలో తేనె, పాలు, దాల్చిన చెక్క పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి.
ఫేషియల్ ఇలా!
ముందుగా ముఖాన్ని శుభ్రపరచుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కొని మెత్తటి గుడ్డతో తుడుచుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖం కాంతివంతం అవుతుంది. గుమ్మడి పండులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కంటికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖంపై ఉన్న మొటిమలు పోయి చర్మం మృదువుగా తయారవుతుంది.
కోడిగుడ్డుతో కోమలంగా..

కావాల్సినవి
* కోడిగుడ్డు - ఒకటి
* నిమ్మరసం - ఒక చెంచా
* పెరుగు - ఒక చెంచా
తయారీ విధానం
ముందుగా కోడిగుడ్డులోని తెల్ల సొనను వేరు చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీనిలో నిమ్మ రసం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
ఫేషియల్ ఇలా!
ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇలా కనీసం వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కోమలంగా తయారవుతుంది.
బార్లీతో భలేగా!

కావాల్సినవి
* బార్లీ గింజల పొడి - రెండు చెంచాలు
* గోరువెచ్చటి నీళ్లు - సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.
ఫేషియల్ ఇలా!
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై నల్ల మచ్చలు ఉన్న చోట పూసి ఓ పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేసుకుని మెత్తని గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మంపై ఉండే మచ్చలు, మృత కణాలు.. తొలగిపోయి చర్మం నాజూగ్గా తయారవుతుంది.
ఈస్ట్ పౌడర్‌తో ఇలా..

కావాల్సినవి
* కోడిగుడ్డు - ఒకటి
* ఈస్ట్ పౌడర్ - రెండు చెంచాలు
* కలబంద గుజ్జు - ఒక చెంచా
తయారీ విధానం
ముందుగా కోడిగుడ్డు తెల్లసొనను ఒక పాత్రలో తీసుకోవాలి. దానిలో ఈస్ట్ పౌడర్, కలబంద గుజ్జు వేసి ముద్దగా కలుపుకోవాలి.
ఫేషియల్ ఇలా!
ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఓ అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతమవుతుంది.
ఓట్స్‌తో..

కావాల్సినవి
* ఓట్స్ - ఒక చెంచా
* మీగడ లేని పెరుగు - మూడు చెంచాలు
* తేనె - ఒక చెంచా
తయారీ విధానం
మెత్తగా చేసిన ఓట్స్‌లో పెరుగు, తేనె వేసి ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి.
ఫేషియల్ ఇలా!
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేషియల్ వల్ల చర్మానికి మృదుత్వం, తాజాదనం వస్తాయి.
కాఫీ పొడితో..

అలసిపోయిన చర్మంతో డల్‌గా కనిపిస్తున్నారా? అయితే ఇది ప్రయత్నించి చూడండి. మీరు ముఖం శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫేస్‌వాష్‌లో కొద్దిగా కాఫీ పొడి వేసుకుని కాసేపు నెమ్మదిగా రుద్దుకోవాలి. తర్వాత శుభ్రపరచుకుంటే చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
ఉప్పు కూడా..
కొద్ది మొత్తాల్లో రాళ్ల ఉప్పు, తేనె తీసుకుని మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కాస్త దాల్చిన చెక్క పొడిని కూడా కలుపుకోవచ్చు. దీనిని మొటిమలున్న చోట రాసుకుని కొద్ది సేపటి తర్వాత కడిగేసుకుంటే మొటిమల బెడద తగ్గే అవకాశం ఉంటుంది.
ఇవండీ.. వంటగదిలో లభించే కొన్ని పదార్థాలు.. వాటితో తయారు చేసుకోదగిన కొన్ని ఫేస్‌ప్యాక్స్.. చాలా సులభంగా ఉన్నాయి కదండీ.. మరి మీరు కూడా వీటిని ఓసారి ప్రయత్నిస్తారు కదూ!