అందమైన అమ్మాయిని చూడగానే ఎవరైనా సరే- 'పచ్చి పాల మీగడ.. అచ్చ తెలుగు ఆవడ..' అంటూ ఆ అందాల్ని పొగిడేయాల్సిందే..! అయితే అందరూ అంతగా మెచ్చుకునే ఆ అందాన్ని సంరక్షించుకోవడానికి కొబ్బరి పాలు కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కొబ్బరి పాలను ఎలా ఉపయోగిస్తే సౌందర్యపరమైన ప్రయోజనాలు సొంతమవుతాయో తెలుసుకుందాం రండి..
కొబ్బరిపాలలో విటమిన్ ఎ, సి, క్యాల్షియం, ఐరన్, సహజ ప్రొటీన్స్.. ఇలా ఎన్నో పోషకాలు ఉండటం వల్ల వీటిని సౌందర్య సంరక్షణకు నిస్సందేహంగా ఉపయోగించవచ్చు.
స్క్రబ్‌లా..!
చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి మనం స్క్రబ్‌ను ఉపయోగిస్తాం. కొబ్బరిపాలను ఉపయోగించి కూడా చాలా చక్కని స్క్రబ్‌ను తయారుచేసుకోవచ్చు. దీనికోసం మనం చేయాల్సిందల్లా కొద్దిగా కొబ్బరిపాలు తీసుకుని అందులో తగినన్ని ఓట్స్ వేసి 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా చేసుకుని స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు. దీన్ని శరీరానికి, ముఖానికి కూడా అప్త్లె చేసుకోవచ్చు. మృతకణాలను తొలగించడమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

సహజ మాయిశ్చరైజర్‌గా..
పొడిచర్మం సమస్యతో బాధపడుతున్న వారికి కొబ్బరిపాలు చాలా చక్కని పరిష్కారం. వీటిని నేరుగా చర్మానికి అప్త్లె చేసి గుండ్రంగా మసాజ్ చేస్తూ 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసేసుకుంటే సరి. మృదువైన, మెత్తని చర్మం మీ సొంతం అవుతుంది.
స్నానానికి కూడా..
స్నానానికి ఉపయోగించే గోరువెచ్చని నీటిలో ఒక కప్పు కొబ్బరిపాలు, కప్పు గులాబీపూల రేకలు, అరకప్పు రోజ్‌వాటర్ కలపాలి. 15 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అంది పొడిబారిన చర్మం సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.
చర్మం ప్రకాశవంతంగా మారడానికి..
కొబ్బరిపాలలో కొద్దిగా తేనె, కొన్ని కుంకుమపువ్వు రేకలు, చందనం పౌడర్ కలపాలి. ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి అవసరమయ్యే పోషణ, తేమ అంది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

జుట్టుకు పోషణ..
కొబ్బరిపాలు కేవలం చర్మానికే కాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమయ్యే పోషకాలు కూడా అందిస్తాయి. అందుకే కొబ్బరిపాలను కేశ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. కొబ్బరిపాలతో తలకు మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల కుదుళ్లకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇలా 3 నుంచి 5 నిమిషాలు మర్దన చేసుకుని, 20 నిమిషాలు ఆరనీయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు చాలా తొందరగా ఎదుగుతుంది. అలాగే జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
ఇలా కూడా..
* కొబ్బరిపాలను మేకప్ తొలగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.
* కేశాలకు చక్కని కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
* ముఖ్యంగా బట్టతల సమస్య రాకుండా అరికడుతుంది.
* కేశాలు మృదువుగా, చిట్లకుండా ఉండేలా చేస్తుంది.
* కొబ్బరిపాలతో రకరకాల స్క్రబ్‌లు, హెయిర్‌ప్యాక్స్ వంటివి ప్రయత్నించవచ్చు.
* విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలను కూడా దరి చేరనీయదు.
* సూర్యరశ్మి వల్ల ప్రభావితమైన చర్మం మీద కొబ్బరిపాలను రాయడం వల్ల చక్కని ఉపశమనం లభిస్తుంది.
* వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు దరి చేరకుండా కూడా కొబ్బరిపాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే కొబ్బరిపాల వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలు మరెన్నో ఉంటాయి. మీరు కూడా వీటిని ఓసారి ప్రయత్నించి చూడండి. మీ సౌందర్య సంరక్షణలో భాగం చేసుకొని మరింత అందాన్ని మీ సొంతం చేసుకోండి.