'చింతపండు'.. ఈ పేరు చెబితే చాలు.. అబ్బ ఎంత పులుపో అనుకోనివారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే అదే సమయంలో కొన్ని వంటకాల్లో చింతపండు లేకపోతే ముద్ద దిగనివారు కూడా ఉంటారు. కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దీనివల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఎక్కువే. అయితే చింతపండు అందాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించవచ్చన్న విషయం మీకు తెలుసా? మీరు ఇప్పటివరకూ ప్రయత్నించి ఉండరు కానీ చింతపండు సౌందర్య పరిరక్షణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి, చింతపండుతో ఇంట్లోనే తయారుచేసుకోదగిన కొన్ని ప్యాక్స్, సౌందర్య ఉత్పత్తుల గురించి తెలుసుకుందామా..

మొటిమలకు..
నిమ్మకాయంత పరిమాణంలో చింతపండును తీసుకొని దాన్ని పావుకప్పు వేడినీటిలో వేసి కాసేపు నాననివ్వాలి. అలా నానిన తర్వాత దానిని బయటకు తీసి మెత్తగా పిసకాలి. దీని నుంచి పిప్పిని వేరు చేసి తీసేయాలి. ఆ తర్వాత ఇందులోంచి టేబుల్ స్పూన్ పరిమాణంలో గుజ్జును తీసుకోవాలి. దీనికి ఒక చెంచా ముల్తానీ మట్టి, కొద్దిగా రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తరచుగా వేసుకుంటూ ఉంటే మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా చర్మం కొత్త మెరుపును కూడా సంతరించుకుంటుంది.
ప్రకాశవంతమైన చర్మం కోసం..
కొద్దిగా చింతపండును తీసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి కాసేపు వేడిచేయాలి. చల్లారిన తర్వాత చింతపండు నుంచి గుజ్జును వేరుచేయాలి. టేబుల్‌స్పూన్ గుజ్జును తీసుకొని దానికి అరచెంచా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

బ్లీచ్లాగానూ..
కొద్దిగా చింతపండును తీసుకొని పావుగంట పాటు వేడినీటిలో నానబెట్టాలి. తర్వాత చింతపండును మెత్తగా పిసికి పిప్పిని వేరుచేయాలి. ఈ చింతపండు రసంలో అరటిపండు గుజ్జు, శెనగపిండిని జతచేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని చర్మానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమం బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి మన చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
స్క్రబ్‌గా..
చింతపండు గుజ్జును కొద్దిమొత్తంలో తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ నిమ్మరసం, అరచెంచా బేకింగ్ సోడా, చెంచా పంచదార కలపాలి. ఈ మిశ్రమంతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. ఈ మిశ్రమం జిడ్డు చర్మం కలిగిన వారికి, మొటిమల సమస్యతో బాధపడే వారికి మంచి మందులా పనిచేస్తుంది.
టోనర్‌గా..
నీటిలో చింతపండు వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఇందులో రెండు చెంచాల నీటిని తీసుకోవాలి. దీనికి రెండు చెంచాల టీ డికాషన్‌ను కలపాలి. క్లెన్సింగ్ పూర్తయిన తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి చర్మానికి రాసుకోవాలి.
ఇవండీ చింతపండుతో వేసుకోదగిన కొన్ని ప్యాక్స్, తయారుచేసుకోదగిన ఇతర సౌందర్య ఉత్పత్తులు.. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే చింతపండును చర్మానికి నేరుగా రాసుకోకూడదు. దీనిని వేరే వాటితో మిశ్రమంగా చేసి మాత్రమే వాడాలి. అంతేకాదు.. చింతపండును ఉపయోగించడం వల్ల కొంతమందికి సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత ఉపయోగించడం మంచిది.