కొందరమ్మాయిలకు ముఖం అంతా బాగానే ఉంటుంది కానీ గడ్డం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్న సమస్య వస్తుంది. అదే- డబుల్ చిన్. మెడపైన, గడ్డం కింద ఉండే చర్మం కాస్త సాగినట్లుగా గడ్డం కంటే కిందకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడటానికి రెండు గడ్డాలు ఉన్నట్లు అన్నమాట! మరి ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? అది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!
డబుల్ చిన్ సమస్య నుంచి బయటపడటానికి ఉపకరించే చిట్కాలు తెలుసుకునే ముందు అసలు అది రావడానికి గల కారణాలు కూడా తెలుసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మళ్లీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడటానికి సాధ్యపడుతుంది. డబుల్‌చిన్ రావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. అవి;
* అధిక బరువు
* వంశపారంపర్యం
* వయసు పైబడడం

అధికబరువు ఉంటే..
మీ వయసు, ఎత్తుకు తగినట్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటే చర్మం వదులుగా అయిపోతుంది. అధికంగా పెరిగే బరువే ఇందుకు ముఖ్యమైన కారణం. కాబట్టి ముందు అధికంగా ఉన్న బరువుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకేసారి బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి జరిగినప్పుడు, గడ్డం దగ్గర అనవసర కొవ్వులు పేరుకుపోయినప్పుడు చర్మం వదులుగా అయి గడ్డం కంటే కాస్త కిందకు కనిపిస్తుంది.
వంశపారంపర్యంగా కూడా..
డబుల్ చిన్ అనే సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా సమస్యకు కారణం జన్యుపరమైతే క్రమం తప్పకుండా మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. డబుల్ చిన్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
వయసు పైబడుతున్నప్పుడు..
వయసు పైబడుతున్నవారు అంటే మధ్యవయస్కుల్లో కూడా మనం ఈ సమస్యను గమనించవచ్చు. కండరాలు వదులుగా అయిపోవడం, కొవ్వు పేరుకుపోవడం.. మొదలైనవన్నీ కూడా ఈ సమస్యకు కారణమయ్యే అంశాలే. ఈ క్రమంలో ముఖం దగ్గర ఉండే కండరాలు వదులు కాకుండా, బిగుతుగా ఉండటానికి ఏం చేయాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి.. వంటివి తెలుసుకుని పాటిస్తేనే వయసు పెరుగుతున్నా ఈ సమస్య బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

సమస్య రావడానికి గల కారణాలు చూశారు కదా..! ఇప్పుడు సమస్యను నివారించుకోవడానికి ఉపకరించే చిట్కాలేంటో చూద్దాం రండి..
బాగా నమలండి..!
డబుల్‌చిన్ సమస్యతో బాధపడేవారు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు బాగా వ్యాయామం అంది పటిష్టంగా ఉంటాయి. దీని వల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా ముఖాకృతి సరిగ్గా ఉంటుంది. అలాగే మార్కెట్లో లభించే షుగర్‌ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే. ఎందుకంటే దవడల దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వు ఇలా చూయింగ్ గమ్స్ నమలడం వల్ల సునాయాసంగా కరిగిపోతుంది.
తెల్లసొనతో..
రెండు గుడ్లలోని తెల్లసొన, ఒక టేబుల్‌స్పూన్ పాలు, కాస్తంత తేనె, నిమ్మరసం.. ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ, డబుల్ చిన్ ఉన్న చోట ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. అలా 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఫలితంగా డబుల్‌చిన్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గుడ్డు వాసన నచ్చనివారు ఈ మిశ్రమంలో ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు.

గ్రీన్ టీ
గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా అనవసరపు కొవ్వును కూడా కరిగించేస్తుంది. కాబట్టి కాఫీకి చెక్ పెట్టి మీకు నచ్చిన ఫ్లేవర్‌లో గ్రీన్ టీ తాగండి.
విటమిన్ ఇ
మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, స్వీట్ కార్న్, యాపిల్, సోయా బీన్స్, కాలేయం, పప్పు దినుసులు.. ఇలాంటి వాటిల్లో విటమిన్ ఇ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిందే.

నీరు ఎక్కువగా..
రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వుతోపాటు దవడ దగ్గరున్న అనవసరపు కొవ్వు కూడా కరిగిపోతుంది. కేవలం ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడమే కాదు.. నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను కూడా తినాలి. అంటే పుచ్చకాయ, కీరా, కమలా(సంత్రా).. లాంటివి.
ఇవి కూడా..
* ఎక్కువగా నవ్వడం, మాట్లాడటం వల్ల కూడా ముఖ కండరాలకు చక్కని వ్యాయామం అందుతుంది. తద్వారా డబుల్‌చిన్ సమస్యను తగ్గించుకోవచ్చు. * మెడ గుండ్రంగా, మెల్లగా కొద్ది సమయంపాటు తిప్పడం, పైకి కిందకు వూపడం.. మొదలైన చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కూడా మంచి ఫలితం చేకూరుతుంది. * బరువు పెరగకుండా చేసే వ్యాయామాలతో పాటు గుండె సంబంధిత వ్యాయామాలు కూడా చేస్తే మరీ మంచిది. * అలాగే తీసుకునే ఆహారపదార్థాల్లో అధిక మొత్తంలో కాల్యరీలు లేనివి, కొవ్వుశాతం తక్కువగా ఉన్నవి మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే బరువు సునాయాసంగా పెరిగిపోతాం.
|
సో.. ఇవండీ.. డబుల్‌చిన్ సమస్య రావడానికి గల కారణాలు.. దాని నుంచి బయటపడటానికి ఉపకరించే చిట్కాలు. మీరు కూడా ఒకవేళ ఈ సమస్యతో సతమతమవుతుంటే వీటిల్లో మీకు నచ్చిన చిట్కా పాటించి చూడండి.