కావ్యకు అటు ఇంటి పని, ఇటు ఆఫీస్ పనితో రోజూ హడావిడే! ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తోన్నా అప్పుడప్పుడూ వర్చువల్ మీటింగ్స్ కోసం మేకప్ వేసుకోక తప్పట్లేదామెకు.
శ్రావ్యకు మేకప్ అంటే చాలా ఇష్టం. రోజూ ఇంట్లోనే ఉన్నా.. ప్రైమర్‌తో కాస్త టచప్ ఇవ్వడం, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకోవడం ఆమెకు అలవాటు.
ఇలా వృత్తిపరంగానైనా, ఆసక్తితో అయినా చాలామంది మేకప్‌తో తమ అందానికి మెరుగులు దిద్దుతుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. మరి మేకప్ వేసుకోవడానికి ఉపయోగించిన బ్రష్‌లు, స్పాంజ్‌ల సంగతేంటి? వాటిని ఎన్ని రోజులకోసారి శుభ్రం చేస్తున్నారు? అనడిగితే పెదవి విరుస్తుంటారు చాలామంది. కానీ వాటిని వారానికోసారి శుభ్రం చేయడం తప్పనిసరి అని, లేదంటే వివిధ రకాల సౌందర్య సమస్యలు తప్పవంటోంది అందాల తార శృతీ హాసన్. అంతేకాదు.. వాటిని ఎలా శుభ్రం చేయాలో చెబుతూ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుందీ ముద్దుగుమ్మ.
చాలామంది హడావిడిగా మేకప్ వేసేసుకోవడం, ఆ బ్రష్‌లు, స్పాంజ్లు పక్కన పడేయడం.. మళ్లీ అవసరమైనప్పుడు వాటినే ఉపయోగించడం.. వంటివి చేస్తుంటారు. ఇలా వాడుకున్న తర్వాత బ్రష్‌లను శుభ్రం చేయకపోతే వాటిపై ఉండే తేమకు వాతావరణంలోని బ్యాక్టీరియా, వైరస్లు ఇట్టే ఆకర్షితమవుతాయి. అసలే ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తోంది కూడా! కాబట్టి కనీసం వారానికోసారైనా మేకప్ వేసుకోవడానికి ఉపయోగించిన బ్రష్/స్పాంజ్‌లను శుభ్రం చేయాలంటున్నారు సౌందర్య నిపుణులు. అయితే వాటిని ఎలా శుభ్రం చేయాలో తాజాగా ఇన్‌స్టా స్టోరీ వేదికగా చెప్పుకొచ్చింది అందాల తార శృతీ హాసన్.

ఈ రెండూ ఉంటే చాలు!
మేకప్ బ్రష్‌లు, స్పాంజ్లు శుభ్రం చేయడానికి రెండు పదార్థాలుంటే చాలంటోంది శృతి. ‘మేకప్ వేసుకోవడమే కాదు.. అందుకోసం ఉపయోగించిన వస్తువుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే! లేదంటే చర్మ సమస్యలు తప్పవు. నేను నా మేకప్ బ్రష్‌లు, స్పాంజ్లు శుభ్రం చేసుకోవడానికి ఈ చిట్కా పాటిస్తాను. ముందుగా ఆలివ్ ఆయిల్, డిష్ సోప్ కొద్దికొద్దిగా తీసుకొని ఒక గిన్నెలో మిశ్రమంలా తయారుచేసుకుంటా. మేకప్ బ్రష్, స్పాంజ్‌లను ఈ మిశ్రమంలో దాదాపు గంట పాటు నానపెడతా. ఆ తర్వాత బాగా రుద్ది కడిగి ఆరబెడతా..’ అంటూ చక్కటి చిట్కాను పంచుకుందీ ముద్దుగుమ్మ.
ఇలా కూడా శుభ్రం చేయచ్చు!

* కప్పు వేడి నీటిలో, రెండు టేబుల్స్పూన్ల వైట్ వెనిగర్/టీస్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో మేకప్ బ్రష్‌లు, స్పాంజ్లు వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసి ఆరబెడితే సరిపోతుంది. వెనిగర్ బ్రష్, స్పాంజ్లకు పరిమళాన్ని కూడా అందిస్తుంది. * ముందుగా గోరువెచ్చటి నీటిలో బ్రష్/స్పాంజ్‌లను తడిపి.. ఆపై లిక్విడ్ డిష్ సోప్‌తో రుద్దినా వాటికి అంటుకున్న మేకప్ వదిలిపోతుంది. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగి ఆరబెట్టాలి. * బేబీ షాంపూతో కూడా మేకప్ బ్రష్/స్పాంజ్‌లను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా గోరువెచ్చటి నీటిలో వీటిని ముంచి వీటిపై కాస్త బేబీ షాంపూ వేయాలి. అరచేతిలో లేదంటే సింక్ మార్బుల్‌పై గుండ్రంగా రుద్దుతూ కడిగేయాలి.
 * ఆలివ్ ఆయిల్లో కాసేపు నానబెట్టిన బ్రష్/స్పాంజ్‌లను ఆపై బేబీ షాంపూతో కడిగేసినా వాటికి అంటుకున్న మేకప్ అవశేషాలు సులభంగా వదిలిపోతాయి. * ఎక్కువ రోజుల పాటు శుభ్రం చేయకుండా పక్కన పడేసిన మేకప్ బ్రష్/స్పాంజ్‌లపై బ్యాక్టీరియా, వైరస్లు ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. అలాంటి వాటిని శుభ్రం చేయడానికి ఈ మిశ్రమాన్ని ఉపయోగించచ్చు. ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని అందులో టీస్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్, కొన్ని చుక్కల బేబీ షాంపూ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బ్రష్/స్పాంజ్‌లను పది నిమిషాలు ఉంచి.. ఆపై కాసేపు తిప్పుతూ ఉండాలి. తద్వారా వాటికి అంటుకున్న మేకప్ అవశేషాలు, బ్యాక్టీరియా సులభంగా వదిలిపోతుంది. ఇప్పుడు సాధారణ నీటితో కడిగేయాలి.
 * కొబ్బరి నూనె, లిక్విడ్ డిష్ సోప్, హ్యాండ్‌వాష్.. ఈ మూడింటినీ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని చిక్కటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఇందులో బ్రష్/స్పాంజ్‌ని ఉంచి కాసేపు తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఎక్కువ బ్రష్‌లు/స్పాంజ్లు శుభ్రం చేయాలనుకుంటే ఎక్కువ మొత్తంలో మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
|
గమనిక: రోజూ మేకప్ వేసుకునే అవసరం ఉన్న వాళ్లు కనీసం వారానికోసారైనా కచ్చితంగా మేకప్ టూల్స్‌ని శుభ్రం చేయమంటున్నారు సౌందర్య నిపుణులు. అలాకాకుండా ఎప్పుడో ఒకసారి మేకప్ వేసుకోవాలనుకునే వారు ఉపయోగించిన వెంటనే బ్రష్/స్పాంజ్‌లను క్లీన్ చేసుకొని, ఆరబెట్టి, భద్రపరచుకోవడం ఉత్తమం.. లేదంటే వాటిపై బ్యాక్టీరియా, వైరస్లు చేరిపోతాయి. అంతేకాదు.. ఇలా శుభ్రం చేసుకున్న మేకప్ టూల్స్‌ని పూర్తిగా ఆరిన తర్వాతే మేకప్ కిట్‌లో భద్రపరచుకోవాలన్న విషయం మర్చిపోకండి!
Also Read:
కరోనా అలర్ట్: మేకప్ కిట్‌ని శానిటైజ్ చేయండిలా !