అందం కోసం తాపత్రయపడని అమ్మాయంటూ ఉంటుందా చెప్పండి..? ఈ క్రమంలో అందంగా మెరిసిపోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం బయట దొరికే క్రీముల దగ్గర్నుంచి ఇంటి చిట్కాల దాకా ప్రతిదీ ట్రై చేస్తుంటారు. అయినా ఒత్తిళ్లు, ఆహారపుటలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత.. వంటి పలు కారణాల వల్ల కొందరిలో వివిధ రకాల సౌందర్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి సమస్యలకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టేయమంటున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు మలైకా అరోరా, భాగ్యశ్రీ. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలేంటో చెబుతూ తాజాగా సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేశారీ చక్కనమ్మలు. మరి, అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవడానికి వారు ఉపయోగించే ఆ బ్యూటీ టిప్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యాన్స్‌కి అనుక్షణం టచ్‌లోనే ఉంటున్నారు సినీ తారలు. ఈ క్రమంలో ఆరోగ్యం, ఫిట్నెస్, బ్యూటీ.. వంటి అంశాలపై ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ మలైకా అరోరా, భాగ్య శ్రీ కూడా ఇదే పనిలో బిజీగా గడుపుతున్నారు. అతివల అందాన్ని ఇనుమడింపజేసే కొన్ని చిట్కాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారీ అందాల అమ్మలు.
అది వయసును దాచిపెడుతుంది!
వయసు పెరుగుతోన్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తోంది బాలీవుడ్ అందాల తార భాగ్య శ్రీ. మరి, ఆ అందం వెనకున్న అసలు సిసలైన సీక్రెట్ ఏంటో వివరిస్తూ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ బ్యూటిఫుల్ మామ్.

‘రోజులు గడుస్తోన్న కొద్దీ అందాన్ని కాపాడుకోవడమంటే అంత సులభం కాదు.. కానీ అందుకు నా దగ్గర ఓ చిట్కా ఉంది. అదే కుంకుమ పువ్వు. ఇందులో బోలెడన్ని యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మంలో కొత్త కణజాలాల్ని ఉత్పత్తి చేసి చర్మాన్ని నవయవ్వనంగా, ప్రకాశవంతంగా మార్చుతాయి. ఇందుకు చేయాల్సిందల్లా.. సగం గ్లాసు గోరువెచ్చటి నీటిలో మూడు నాలుగు కుంకుమపువ్వు రేకల్ని వేసి బాగా కలిపి పరగడుపునే తీసుకోండి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తూ మీ ముఖంలో రెట్టింపయ్యే కాంతిని పరిశీలించండి. ఈ చిట్కా నాకు వర్కవుట్ అవుతోంది.. మీకూ అవుతుందనుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
సాధారణంగా కుంకుమ పువ్వు ధర కాస్త ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందుకే గర్భం ధరించినటువంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప చాలామంది నిత్య జీవితంలో దీనిని పెద్దగా వాడరు. అయితే దీనిని కొనుగోలు చేయగలిగిన వాళ్ళు మాత్రం భాగ్యశ్రీ చెప్పిన ఈ చిట్కాని పాటించడంలో తప్పు లేదేమో.
మొటిమల్ని అలా దూరం చేసుకున్నా!
చాలామంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే సౌందర్య సమస్యల్లో మొటిమలు ప్రధానమైనవి. ఈ సమస్య అప్పుడప్పుడు తనకూ ఎదురవుతుందని చెబుతూనే.. దాన్నుంచి బయటపడే చిట్కాను సైతం సూచించింది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ క్రమంలో ఓ వీడియోను సైతం పోస్ట్ చేసింది.

‘ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన చర్మతత్వం ఉంటుంది. నాదైతే చాలా సున్నితమైన చర్మం.. అయితే అప్పుడప్పుడూ నాకు మొటిమల సమస్య తలెత్తుతుంటుంది. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. వాతావరణ మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, మేకప్ ఉత్పత్తుల్ని అతిగా వాడడం.. వంటివి వాటిలో కొన్ని! అయితే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎక్కడికో వెళ్లక్కర్లేదు.. కిచెన్లోనే ఓ అద్భుత ఔషధం ఉంది. అదేంటంటే.. కొద్దిగా దాల్చిన చెక్క పొడిలో టేబుల్‌స్పూన్ తేనె, కాస్త నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్లు, నోటి ప్రాంతాల్లో మినహా ముఖమంతా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా సమస్య తీవ్రతను బట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. అయితే మరో విషయం ఏంటంటే.. సమస్య మరీ తీవ్రంగా ఉన్న వాళ్లు నిపుణుల్ని సంప్రదించడం లేదంటే ఇదే చిట్కాను నిపుణుల సలహా మేరకు వాడడం ఉత్తమం..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
|