సాధారణంగా జుట్టు దువ్వుకోవడానికి మీరు ఏ దువ్వెన వాడతారు? అయినా అదేం ప్రశ్న.. అది అందరూ వాడేదేగా.. ప్లాస్టిక్ దువ్వెన! అంటారా? అది నిజమే అనుకోండి.. కానీ ప్లాస్టిక్ దువ్వెన వల్ల పర్యావరణానికే కాదు.. జుట్టుకూ నష్టమేనంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే ధనావేశం, జుట్టులో ఉండే రుణావేశంతో ఆకర్షితమై జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సైన్స్ చెబుతోంది. అందుకే ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వేటప్పుడు జుట్టు దువ్వెనకు అతుక్కుపోవడం మనం గమనిస్తూనే ఉంటాం.. అయినా ఇప్పుడీ సైన్స్ గోల మనకెందుకు గానీ.. జుట్టు సమస్యల్ని తొలగించి కేశ సౌందర్యం రెట్టింపు చేసుకోవాలంటే ప్లాస్టిక్‌కి బదులుగా చెక్కతో చేసిన దువ్వెనే సరైందంటున్నారు నిపుణులు. అందుకూ ఓ కారణముంది.. అదేంటంటే.. చెక్క విద్యుత్తును ప్రసరింపజేయదు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ జరగదట! ఇదే కాదు.. చెక్కతో తయారుచేసిన దువ్వెన వాడడం వల్ల జుట్టుకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి...

జిడ్డుదనం నుంచి విముక్తికి..
సాధారణంగా కుదుళ్ల నుంచి సహజసిద్ధమైన నూనెలు విడుదలవుతుంటాయి. ఈ క్రమంలో మనం ప్లాస్టిక్ లేదా ఏ ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనలను ఉపయోగించినా ఆ నూనెలు కేశాలకు అందకుండా ఆయా దువ్వెనలకు అంటుకుపోతాయి. అదే చెక్కతో చేసిన దువ్వెనైతే.. ఈ నూనెల్ని సులభంగా జుట్టంతా పరచుకునేలా చేస్తుంది. తద్వారా కేశాలకు పోషణ అందుతుంది. అలాగే జుట్టు జిడ్డుగా మారకుండా, అదే సమయంలో నిర్జీవంగా కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా కేశాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
కుదుళ్లకు ‘మర్దన’!
ప్లాస్టిక్ లేదా ఏ ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనల కంటే చెక్కతో చేసిన దువ్వెనలు అత్యంత సున్నితంగా ఉంటాయి. మన కుదుళ్లకు కావాల్సింది కూడా ఆ సున్నితత్వమే! అలాకాకుండా కొందరు కుదుళ్లు దురదగా ఉందని పదునుగా ఉండే దువ్వెనతో బలంగా దువ్వుతుంటారు. దానివల్ల కుదుళ్లు డ్యామేజ్ అవుతాయి. అలాకాకుండా సున్నితమైన చెక్క దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల ఈ ప్రక్రియ కుదుళ్లకు మసాజ్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఈ దువ్వెన బ్రిజిల్స్ కుదుళ్లపై ఉండే ఆక్యుపంక్చర్ పాయింట్స్‌కి సున్నితంగా ఒత్తిడి కలగజేసి.. తద్వారా అక్కడ రక్తప్రసరణ సవ్యంగా జరిగి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి.. చెక్క దువ్వెనతో దువ్వినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో!!

చుండ్రుకు చెక్!
కుదుళ్లు పొడిబారిపోవడం, జిడ్డుదనం, ఆ భాగంలో రాపిడి వల్ల చుండ్రు రావడం మనకు తెలిసిందే. అయితే ఇదంతా ప్లాస్టిక్ లేదా ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనలు వాడడం వల్లే అంటున్నారు సౌందర్య నిపుణులు. అదే చెక్కతో చేసిన దువ్వెనైతే.. దాని బ్రిజిల్స్ సున్నితంగా ఉంటాయి.. అలాగే కుదుళ్లలో విడుదలయ్యే సహజ నూనెల్ని జుట్టంతా పరచుకునేలా చేస్తుంది కాబట్టి ఆ భాగంలో జిడ్డుగా మారదు. తద్వారా కుదుళ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండి.. చుండ్రు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
అలర్జీలకు బైబై!
కొంతమందికి కుదుళ్లలో చర్మం సున్నితంగా ఉంటుంది. అలాంటి వారికి ప్లాస్టిక్ లేదా ఏ ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనలైనా అలర్జీలను కలిగించచ్చు. కాబట్టి అలాంటి వారు చెక్కతో తయారుచేసిన దువ్వెనలు వాడడం వల్ల చెక్కలోని సహజసిద్ధమైన సమ్మేళనాలు కుదుళ్లకు ఎలాంటి హానీ కలిగించవు. ఫలితంగా అటు కుదుళ్లు, ఇటు జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు.
ఇవి కూడా!
* ప్లాస్టిక్ దువ్వెనతో బలంగా దువ్వడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. అదే చెక్క దువ్వెన సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉండదు.
* వెంట్రుకల్లో చిక్కుకున్న దుమ్ము, ధూళిని చెక్క దువ్వెనలు ఈజీగా తొలగిస్తాయి. అదే ప్లాస్టిక్ దువ్వెనలైతే ఈ దుమ్ము, ధూళిని ఆకర్షించి.. మరోసారి దువ్వినప్పుడు అవి మళ్లీ జుట్టులోకి చేరడం, వెంట్రుకలు చిక్కులు పడేలా చేయడం, కేశాల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి.
* చెక్క దువ్వెనలు ఎక్కువ కాలం మన్నడంతో పాటు అన్ని జుట్టు తత్వాల వారికీ చక్కగా సరిపోతాయి. అలాగే వీటివల్ల పర్యావరణానికీ ఎలాంటి నష్టమూ జరగదు.
ఎలా శుభ్రం చేయాలంటే..!

ప్లాస్టిక్ దువ్వెనలా చెక్క దువ్వెనను కూడా నీటితో శుభ్రం చేస్తానంటే కుదరదు. ఎందుకంటే నీళ్లు తాకితే చెక్క డ్యామేజ్ అవుతుంది. అందుకే వీటిని తేమ ఉన్న చోట కాకుండా పొడిగా ఉండే చోట భద్రపరచాలి. అలాగే వీటిని శుభ్రం చేసే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. * అవిసె గింజల నూనెను దువ్వెన బ్రిజిల్స్, హ్యాండిల్‌పై అప్లై చేసి.. గంట పాటు పక్కన ఉంచేయాలి. ఆ తర్వాత శుభ్రమైన, పొడి గుడ్డతో తుడిచేస్తే చెక్క దువ్వెన క్లీన్ అవుతుంది. * దువ్వెన బ్రిజిల్స్లో ఇరుక్కున్న మురికి అంత త్వరగా వదిలిపోదు. అలాంటప్పుడు శాండ్‌పేపర్ (ఒకవైపు గరుకుగా ఉన్న పేపర్)తో నెమ్మదిగా రుద్ది మురికిని వదలగొట్టాలి. అయితే ఈ గరుకైన పేపర్‌తో దువ్వెన డ్యామేజ్ అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ గరుకుతలం మరీ అంత బరకగా ఉండకుండా సున్నితంగానే ఉంటుంది కాబట్టి ఆ సందేహం అక్కర్లేదు. * కొద్దిగా పెట్రోలియం జెల్లీని దువ్వెన బ్రిజిల్స్, హ్యాండిల్‌పై రాసి కాసేపు పక్కన పెట్టేయాలి. ఆపై మృదువైన వస్త్రంతో తుడిచేయాలి. * దువ్వెనను శుభ్రం చేయడానికి బ్లో డ్రయర్స్ ఉపయోగించద్దు.. అలాగే సోప్ లిక్విడ్స్ వంటివీ వాడకూడదు. ఇవి చెక్క దువ్వెనను డ్యామేజ్ చేస్తాయి.
|
చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకున్నారుగా! అయితే ఆలస్యమెందుకు.. ప్లాస్టిక్ వాటికి స్వస్తి చెప్పి చెక్క దువ్వెనను ఎంచుకుందాం.. మన కురుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!