అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఈ నూనెతో మొటిమలు పరార్!
మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, చిన్న వయసులోనే ముఖంపై ముడతలు - గీతలు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు దరిచేరడం, స్ట్రెచ్ మార్క్స్, చర్మం పొడిబారడం.. ఇలాంటివన్నీ మహిళల జీవనవిధానంలో కామన్‌గా ఎదురయ్యే సౌందర్య సమస్యలే. అయితే వీటి నుంచి బయటపడడానికి మనలో చాలామంది ఏంచేస్తారు? బయట దొరికే క్రీములు, మందులు వాడుతూ తక్షణం ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ హవాయ్ మహిళలు ఇలాంటి సమస్య పరిష్కారానికి 'తమను నూనె'ను ఉపయోగిస్తుంటారు. 'తమను' చెట్టు బెరడు నుంచి సేకరించిన ఈ నూనె యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీంతో తరచూ చర్మానికి మర్దన చేసుకోవడం వల్ల ఇది చర్మంలోకి ఇంకి.. పైన పేర్కొన్న చర్మ సమస్యలన్నీ ఆనవాళ్లు లేకుండా మటుమాయమయ్యేలా చేస్తుంది. అలాగే ఈ నూనె నుంచి వచ్చే సువాసన వల్ల చర్మానికి అరోమా థెరపీ చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కేవలం చర్మానికే కాదు.. ఈ నూనె జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తుంటారు హవాయ్ బ్యూటీస్.

తేమను అందిస్తుంది..
చర్మమైనా, జుట్త్టెనా అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే తేమ కలిగి ఉండడం చాలా ముఖ్యం. కానీ వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి కారకాలు, మనం తీసుకునే ఆహారం.. ఇలా కారణమేదైనా ప్రస్తుతం చర్మం, జుట్టు కుదుళ్లు పొడిబారిపోయి నిర్జీవంగా తయారవుతున్నాయి. ఇది మన అందాన్ని దెబ్బతీస్తుంది. మరి, ఇలాంటి సమస్యల నుంచి బయటపడి చర్మానికి, జుట్టుకు తేమనందించడానికి హవాయ్ మహిళలు ఫాలో అయ్యే సౌందర్య సాధనం 'కుకుయ్ నట్ ఆయిల్'. కుకుయ్ చెట్టును అక్కడి ప్రాంతీయ చెట్టుగా అభివర్ణిస్తుంటారు. దీని గింజల నుంచి సేకరించిన నూనెనే కుకుయ్ నట్ ఆయిల్గా చెబుతారు. 'ఎ', 'సి', 'ఇ' విటమిన్లతో పాటు ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ నూనెను చర్మం, జుట్టు కుదుళ్లకు పట్టిస్తే వాటికి సరైన మోతాదులో తేమను అందించి.. తాజాగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. జుట్టు పట్టులా మెరవడమే కాదు.. ఒత్తుగా పెరిగేలా చేయడంలోనూ ఈ నూనెను వాడుతుంటారు అక్కడి మగువలు. అంతేకాదు.. సొరియాసిస్, అలర్జీలు, మొటిమలు, మచ్చలు, చుండ్రు.. వంటి సమస్యల్నీ ఇది నివారిస్తుంది.

కాఫీతో మెరిసే చర్మం!
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రస్తుతం వాతావరణ కాలుష్య ప్రభావం చర్మంపై పడుతోంది. తద్వారా చర్మంపై దద్దుర్లు, ఎరుపెక్కడం, ఉబ్బడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటికి విరుగుడేంటని హవాయ్ మహిళల్ని అడిగితే 'కోనా కాఫీ' అని బదులిస్తారు. ఆ దీవుల్లో ఎక్కువగా పండించే ఈ కాఫీ గింజల్లో ఫ్రీరాడికల్స్‌తో పోరాడే గుణాలు అధికంగా ఉంటాయి. తద్వారా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ నుంచి విముక్తి పొందచ్చు. ఇందుకోసం ఈ కాఫీ గింజల పొడిని ఫేస్‌ప్యాక్స్‌లో భాగం చేసుకోవడం, చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో వాడడం.. వంటివి చేస్తుంటారు.

'పండు'లా మెరిసిపోవాలంటే..!
చర్మంపై ఏర్పడే మృతకణాలు అందాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. మరి, వీటిని తొలగించుకొని మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే.. అది పండ్లతోనే సాధ్యమంటున్నారు హవాయ్ మగువలు. పైనాపిల్, అరటి, మామిడి, బొప్పాయి, జామ, ప్యాషన్ ఫ్రూట్.. వంటి వివిధ పండ్లను తమ బ్యూటీ రొటీన్లో భాగం చేసుకుంటుంటారు వారు. ఈ క్రమంలో ఈ పండ్ల నుంచి సేకరించిన గుజ్జును ముఖానికి, మెడకు అప్త్లె చేసుకోవడం వల్ల ఆయా పండ్లలో ఉండే ఎంజైమ్స్ చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. అలాగే మృతకణాల్నీ తొలగిస్తాయి. తద్వారా చర్మం నవయవ్వనంగా, ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.

'చెరకు'తో స్క్రబింగ్!
ఫేషియల్‌లో భాగంగానే కాకుండా తరచూ స్క్రబింగ్ చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. ఇందుకోసమే ఇంట్లో తయారుచేసుకున్న వివిధ పదార్థాలను స్క్రబింగ్ కోసం ఉపయోగిస్తుంటాం. హవాయ్ మగువలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తుంటారు. అయితే వారు స్క్రబింగ్ కోసం ఎక్కువగా చెరకును వాడుతుంటారు. దీంతో ముఖం, పెదాలపై మర్దన చేసుకుంటుంటారు. తద్వారా ఆయా భాగాల్లో ఏర్పడిన మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

కొబ్బరి పాలతో జుట్టు ఒత్తుగా..
అందమంటే చర్మమే కాదు.. జుట్టు కూడా అందులో భాగమే. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరిగినప్పుడే కేశ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఈ ఫలితాన్ని పొందడం కోసం హవాయ్ మగువలు ఉపయోగించే సాధనం కొబ్బరి పాలు, కొబ్బరి నూనె. నూనెను తరచూ తలకు రాసుకోవడం, కొబ్బరి పాలను హెయిర్ప్యాక్స్లో భాగం చేసుకోవడం అక్కడి మహిళలు ఎక్కువగా పాటించే బ్యూటీ మంత్రం. రాత్రుళ్లు పడుకునే ముందు నూనె లేదా హెయిర్‌ప్యాక్ వేసుకొని ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కేశాలు ఒత్తుగా పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయని వారి నమ్మకం.
మరికొన్ని..

* జిడ్డు చర్మతత్వం ఉన్న హవాయ్ మహిళలు తమ జిడ్డును తొలగించుకోవడానికి అగ్నిపర్వతపు బూడిద (వోల్కనిక్ యాష్)ను ఉపయోగిస్తుంటారు. దాన్ని ఫేస్‌ప్యాక్స్, బాడీ మాస్కుల్లో భాగం చేసుకోవడం వల్ల అందులో ఉండే ఖనిజాలు చర్మంపై ఉండే మలినాల్ని, జిడ్డును తొలగించి మేను మెరిసేలా చేస్తాయి. * హవాయ్ దీవుల్లో ఎక్కువగా పండే 'మకడామియా నట్ ఆయిల్'ను క్రీమ్స్, లోషన్స్.. వంటి బ్యూటీ ఉత్పత్తుల్లో వాడుతుంటారు హవాయ్ వాసులు. వీటిని ఉపయోగిస్తే చర్మంలో కొత్త కణాలు ఉత్పత్తవుతాయి. తద్వారా ముఖంపై ఏర్పడే ముడతలు, గీతలకు స్వస్తి పలకచ్చు. * 'ఆపుహి' - దీన్ని హవాయ్ దేశంలో అల్లంగా పరిగణిస్తారు. ఎరుపు రంగు పువ్వులాగా ఉండే దీన్ని షాంపూలు, కండిషనర్ల తయారీలో ఉపయోగిస్తుంటారు అక్కడి వారు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, షైనీగా మారుతుంది. అలాగే ఈ పువ్వు నుంచి సేకరించిన జ్యూస్‌ని చర్మంపై మచ్చలున్న చోట ఉపయోగిస్తే అవి మటుమాయమవుతాయి.
 * చర్మ అలర్జీలను దూరం చేసే శక్తి కలబందకు ఉంది. అందుకే ఈ సమస్య నుంచి విముక్తి పొందడం కోసం హవాయ్ మగువలు కలబంద గుజ్జును నేరుగా సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకుంటారు. అలాగే చర్మ సంరక్షణకు ఉపయోగించే క్రీమ్స్, లోషన్లు, క్లెన్సర్లు, బాడీ వాష్‌లు, లిప్బామ్స్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. * కాఫీ కుటుంబానికి చెందిన 'నోని' చెట్లు హవాయ్లో ఎక్కువగా ఉంటాయి. వాటి బెరడు, రసంలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్.. వంటి ఎన్నో గుణాల మిళితమైన ఈ చెట్టు బెరడు, రసాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించి కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కుదుళ్లలో దురద, చుండ్రు, జుట్టు పొడిబారిపోవడం.. వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. * వీటితో పాటు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం, తాజా పండ్లను తమ డైట్లో భాగం చేసుకోవడం.. వంటివీ హవాయ్ మహిళల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో దోహదం చేస్తున్నాయి.
|
హవాయ్ మహిళల సంపూర్ణ సౌందర్యం వెనకున్న సింపుల్ అండ్ స్వీట్ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకున్నారుగా! ఈ పదార్థాలతో చాలా వరకు మన మార్కెట్లలోనూ లభిస్తాయి.. అలాగే కలబంద వంటివి మన ఇళ్లలోనూ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించి మనమూ న్యాచురల్ బ్యూటీని సొంతం చేసుకుందామా మరి!