కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య పరంగానూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అందాన్ని సంరక్షించుకోవడమనేది అమ్మాయిలకు ఓ పెద్ద సవాలు లాంటిది. వాతావరణంలో తేమ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల ముఖమంతా జిడ్డుగా మారడం, తద్వారా మొటిమలు రావడంతో చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక దీనికి తోడు ఈ కాలంలో జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇందుకు వాతావరణంలో అధికంగా ఉండే హైడ్రోజన్ స్థాయులే కారణమంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి బయటపడి జుట్టును సంరక్షించుకోవాలంటే మన వంటింట్లో ఉండే ఈ మూడు ఆహార పదార్థాల వల్లే సాధ్యమవుతుందంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ పోస్టులు పెట్టే ఆమె.. తాజాగా జుట్టు సంరక్షణకు సంబంధించిన మరో పోస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మరి, ఇంతకీ ఈ కాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి రుజుత సూచించిన ఆ వంటింటి చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఈ కాలంలో గాలిలో హైడ్రోజన్ స్థాయులు అధికంగా ఉంటాయి. అవి జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఫలితంగా జుట్టు రాలే సమస్య అధికమవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా ఈ సమస్యకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అలాగని ఆ సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మన అందాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం. కాబట్టి మన వంటింట్లో ఉండే మూడు పదార్థాలు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఈ క్రమంలోనే వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుతమైన చిట్కాలను తాజాగా ఇన్‌స్టా పోస్ట్ రూపంలో పంచుకున్నారామె.

మెంతులు
కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కొన్ని మెంతులు వేసి చల్లారేంత వరకు అలాగే పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఈ నూనెను రాత్రి పడుకునే ముందు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి.. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. అలాగే మెంతుల్ని మీరు రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లోనూ భాగం చేసుకోవాలి. కిచిడీలో, రుచి కోసం రైతాలో, గుమ్మడికాయ వంటి కాయగూరలతో తయారుచేసే వంటకాల్లో మెంతుల్ని వాడచ్చు. కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. అలాంటి వారు మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య నుంచి సత్వర ఉపశమనం పొందచ్చు. అలాగే రక్తంలో ఇన్సులిన్ స్థాయుల్ని కూడా ఇవి క్రమబద్ధీకరిస్తాయి.

అలీవ్ గింజలు (అడియాలు)
అలీవ్ గింజలు (Aliv Seeds) లేదా అడియాలను నీళ్లలో నానబెట్టి.. రాత్రి పడుకునే ముందు తాగే పాలలో కలుపుకొని తీసుకోవాలి. లేదంటే ఈ గింజలను కొబ్బరి తురుము, నెయ్యితో కలిపి ఉండలుగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. తద్వారా ఈ గింజల్లో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలోకి చేరుతుంది. అంతేకాదు.. కీమోథెరపీ చికిత్స చేయించుకునే క్రమంలో జుట్టు బాగా రాలిపోతుంటుంది. అలాంటి వారికి ఈ గింజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.

జాజికాయ
పాలల్లో కొన్ని అలీవ్ గింజలు, కొద్దిగా జాజికాయ పొడి వేసుకొని బాగా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఫలితంగా జాజికాయలో అధికంగా ఉండే విటమిన్ ‘బి6’, ఫోలికామ్లం, మెగ్నీషియం.. వంటి పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి.
ఇవి కూడా!

* నెయ్యిలో ఉండే అత్యవసర కొవ్వు పదార్థాలు జుట్టు రాలే సమస్యను అరికడతాయి. * పసుపులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. * పెరుగులో ఉండే ఖనిజాలు ప్రొబయోటిక్ బ్యాక్టీరియా సమస్య నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తాయి.
|
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందని కంగారు పడే వాళ్లు ఈ వంటింటి చిట్కాలను పాటించి ఆ సమస్యను అరికట్టవచ్చు. కాబట్టి వీటిని మనమూ ఫాలో అయిపోయి అటు సౌందర్యాన్ని, ఇటు ఆరోగ్యాన్నీ పరిరక్షించుకుందాం..!