
అర్జెంటుగా ఓ ఫంక్షన్‌కి హాజరు కావాలి.. మెహెందీ పెట్టుకుందామంటే.. మంచి డిజైన్ ఎంచుకుని, దాన్ని పెట్టుకుని, అది ఆరడానికి చాలా సమయం పడుతుంది. కానీ అంత టైం లేక మామూలుగానే కార్యక్రమానికి హాజరవుతుంటారు చాలామంది.
చక్కగా షేప్ చేసిన గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ కొంతమందికి గోళ్లు దృఢంగా లేకపోవడం వల్ల అవి పదే పదే విరిగిపోతూ ఉంటాయి. తద్వారా నెయిల్ పాలిష్ వేసుకోవాలన్న ఆలోచనను కూడా విరమించుకుంటుంటారు.
‘కలువ రేకల్లా వంపులు తిరిగిన కనురెప్పలతో కూడిన ఆమె కళ్లు ఎంత అందంగా ఉన్నాయో!’ అని ఎదుటి అమ్మాయిని చూసి మనం అనుకోవడం సహజం. కానీ చాలామందికి కనురెప్పలపై వెంట్రుకలు రాలిపోయి బోసిగా కనిపిస్తుంది.
అందంగా ముస్తాబయ్యే క్రమంలో మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి కదూ! మరి, వీటికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? లేదా? అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ‘ఫేక్’ బ్యూటీ గ్యాడ్జెట్ల గురించి తెలుసుకోవాల్సిందే!

ఫేక్ నెయిల్స్
వాతావరణం, మనం తీసుకునే ఆహారం కారణంగా గోళ్లు పొడిబారిపోయి, పెళుసులుగా మారి విరిగిపోతున్నాయని బాధపడే వారు మనలో చాలామందే ఉంటారు. తద్వారా పొడవాటి గోళ్లు సొంతం చేసుకోవాలన్న వారి కల కలగానే మిగిలిపోతుంది. మరి, అలా జరగకుండా అందమైన గోళ్లతో మెరిసిపోవాలంటే.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఫేక్ నెయిల్స్’ని మీ బ్యూటీ కిట్‌లో చేర్చుకోవాల్సిందే! తద్వారా అందరిలాగే మీరూ చక్కగా షేప్ చేసిన పొడవాటి గోళ్లకు మీకు నచ్చిన నెయిల్ పాలిష్, నెయిల్ ఆర్ట్‌లను పెట్టుకోవచ్చు. అందరి చేతా వావ్ అనిపించుకోవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా చక్కగా తీరైన ఆకృతిలో షేప్ చేసిన గోళ్ల మాదిరిగా ఉంటాయీ నెయిల్స్. వాటిని నెయిల్ గ్లూ స్టిక్ సహాయంతో మీ గోళ్లపై అంటించుకుంటే సరిపోతుంది. ఇక దానిపై మీకు నచ్చిన రంగులతో నెయిల్ పాలిష్ వేసుకోవడం, నెయిల్ ఆర్ట్ వేసుకోవడం.. వంటివి చేయచ్చు. ఇవి మీకు వివిధ రకాల షేప్స్‌లో దొరుకుతాయి. కాబట్టి మీ నెయిల్ షేప్‌ను బట్టి తీరైన ఆకృతితో కూడిన ఫేక్ నెయిల్స్‌ను ఎంచుకోవడమే తరువాయి. అలాగే మీరు కొనుగోలు చేసిన దాన్ని కూడా మీకు నచ్చిన ఆకారంలో షేప్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీటితో పాటు ముందుగానే నెయిల్ ఆర్ట్ వేసిన ఫేక్ నెయిల్స్ కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని అందమైన గోళ్లను మీ సొంతం చేసుకోండి. వీటి నాణ్యత, డిజైన్, ఒక ప్యాకెట్లో ఉండే నెయిల్స్ సంఖ్యను బట్టి ధర రూ.120 నుండి రూ.1100 వరకు ఉంటుంది.

టెంపరరీ హెన్నా స్టిక్కర్స్
మనదేశంలో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా అమ్మాయిలంతా తమ చేతికి వివిధ డిజైన్స్‌తో మెహెందీ పెట్టుకుని అందంగా మెరిసిపోతుంటారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో అంత సమయం లేక మెహెందీపై ఆసక్తి చూపని వారు కొందరైతే.. మెహెందీ డిజైన్ అంత త్వరగా వదిలిపోదు అంటూ వెనకడుగు వేసే వారు మరికొందరు. పెళ్లి, రిసెప్షన్.. అంటూ మెహెందీ డిజైన్లను మార్చాలనుకునే వారు ఇంకొందరుంటారు. అలాంటి వారు సాధారణ మెహెందీ పెట్టుకుంటే వెంటవెంటనే మార్చడం అసాధ్యం. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి ‘టెంపరరీ హెన్నా స్టిక్కర్స్’. చిత్రంలో చూపించిన విధంగా అవి వివిధ డిజైన్స్‌లో లభిస్తాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని.. మీరెప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాని వెనకాల ఉన్న స్టిక్కర్‌ను తొలగించి అరచేతిలో అంటించుకుంటే సరిపోతుంది. కేవలం సాధారణ మెహెందీ డిజైన్లలోనే కాకుండా.. స్టోన్, పర్ల్ డిజైన్స్‌లో కూడా ఈ స్టిక్కర్స్ లభిస్తున్నాయి. వీటిని తిరిగి ఉపయోగించేలా ఉండేవి కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాగే పెట్టుకున్న తర్వాత మీకు నచ్చినపుడు దాన్ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.. ఇలా గంటకో డిజైన్‌తో మెహెందీ పెట్టేసుకోవచ్చు. వీటి డిజైన్, ప్యాకెట్లో లభించే మెహెందీ స్టిక్కర్స్ సంఖ్యను బట్టి ధర రూ. 150 నుండి రూ. 700 వరకు ఉంటుంది.

ఫాల్స్ లాషెస్..!
ముఖానికి వేసుకునే మేకప్ అంతా ఓ ఎత్తైతే.. కళ్లకు వేసుకునే మేకప్ మరోఎత్తు.. ఈ క్రమంలో కాటుక, ఐ లైనర్, మస్కారా.. అంటూ ఎంతో అందంగా మన కళ్లను తీర్చిదిద్దుతాం. ఇలా మనం కంటిని ఎంత అందంగా తీర్చిదిద్దినా.. కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా ఉన్నప్పుడే వాటి అందం ఇనుమడిస్తుంది. అయితే కొందరికి కనురెప్పల వెంట్రుకలు రాలిపోయి పలుచగా కనిపిస్తుంటాయి. మరి అలాంటి వారు మార్కెట్లో లభిస్తోన్న ‘ఫాల్స్ లాషెస్’ ఉపయోగిస్తే కలువ రేకల్లా వంపులు తిరిగిన కనురెప్పల్ని సొంతం చేసుకోవచ్చు. ఫొటోలో చూపిన విధంగా కంటి పైరెప్పకు, కింది రెప్పకు అమర్చుకునేలా వంపులు తిరిగి ఉంటాయీ లాషెస్. వీటిని కంటికి అమర్చుకోవడానికి గ్లూ కూడా అందుబాటులో ఉంటుంది. దాని సహాయంతో వంపులు తిరిగిన లాషెస్ను మీ కనురెప్పల చివర్లలో సులభంగా అంటించుకోవచ్చు. అలాగే వీటిని తొలగించడం కూడా సులభమే. మీరు వాడే గ్లూ కంటికి హాని కూడా కలిగించదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. కాబట్టి నిర్భయంగా వీటిని ధరించి అందమైన కళ్లను మీ సొంతం చేసుకోవచ్చు. వీటి నాణ్యత, సంఖ్యను బట్టి ధర రూ.199 నుండి రూ.599 వరకు ఉంటుంది.

ఫ్లా కన్సీల్ టేప్
ముఖంపై మచ్చలను కనిపించకుండా చేయడం అంటే అంత ఈజీ కాదు.. అలాగే ఒక్కోసారి శరీరంపై పలు చోట్ల గాయాల వల్ల మచ్చలు ఏర్పడతాయి.. వాటిని దుస్తులతో కనిపించకుండా చేయాలంటే ఒక్కోసారి సాధ్యం కాదు.. ఇక ట్యాటూ వేయించుకున్నాక వాటిని తీయించుకోవాలంటే దాదాపు అసాధ్యమే అని చెప్పుకోవాలి. మరి, వీటన్నింటినీ తాత్కాలికంగా కనిపించకుండా చేయడమెలా.. అని ఆలోచిస్తున్నారా? అందుకేగా ‘ఫ్లా కన్సీల్ టేప్’ మార్కెట్లో లభ్యమవుతోంది. ఫొటోలో చూపించిన విధంగా ఇది శరీర రంగులో అచ్చం చర్మంలాగానే ఉంటుంది. దీనికి వెనకవైపు ఉన్న స్టిక్కర్‌ని తొలగించి.. మీరు మేకప్ చేసుకునే ముందు ముఖంపై పూతలా పరచుకునేలా అతికించుకోవాలి. అది ముఖంపై మచ్చలను కనిపించకుండా చేయడంతో పాటు మీరు వేసుకునే మేకప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. శరీరంలో ఏ భాగంలోని మచ్చలను దాచిపెట్టడానికైనా.. ట్యాటూలను తాత్కాలికంగా కనిపించకుండా చేయాలన్నా ఈ టేప్‌తో కవర్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఎంచుకునేటప్పుడు మీ శరీర రంగుకు నప్పుతుందో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మాత్రం తప్పనిసరి. అప్పుడే ఎబ్బెట్టుగా కనిపించకుండా సహజంగా మీ అందం ద్విగుణీకృతమవుతుంది. అలాగే ఈ టేప్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలం. దీని నాణ్యతను బట్టి ధర రూ.220 నుండి రూ.1100 వరకు ఉంటుంది.

ఫాల్స్ సిలికాన్ టీత్
తెల్లగా, చక్కగా ఉండే పలువరుసని చూస్తే ముచ్చటగా ఉంటుంది. వారు నవ్వుతుంటే ఎంత బాగుందో అనుకుంటాం. అలా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కూడా! కానీ పలు కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారడం, పలు వరుస సరిగ్గా లేకపోవడం వల్ల నలుగురిలో మాట్లాడడానికి చాలా ఇబ్బందిపడుతుంటారు కొందరు. కానీ ఇకపై మీరలా అనుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే మీ పళ్ల మధ్యలో గ్యాప్ ఉన్నా.. పన్ను ఊడిపోయినా.. ముడిపళ్లు ఉన్నా.. ఈ లోపాలన్నింటినీ ‘ఫాల్స్ సిలికాన్ టీత్’తో కవర్ చేసుకోవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం దంతాల మాదిరిగా విడివిడిగా లభ్యమవుతుంటాయివి. అలాగే మీరు మొత్తం పలువరుసనే కవర్ చేసుకోవాలనుకుంటే.. ఫొటోలో చూపించిన విధంగా పళ్ల సెట్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని మీ దంతాలపై అమర్చుకోవడమే తరువాయి! ఇలా దీన్ని మీరు శుభ్రం చేసుకుంటూ ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. వీటి నాణ్యత, విడి దంతాల సంఖ్య, పలువరుస సెట్‌ను బట్టి ధర రూ.399 నుండి రూ.1700 వరకు ఉంటుంది.
ఎంత అందమైన వారిలోనైనా చిన్న చిన్న లోపాలు ఉండడం అనేది కామన్. అలాంటి వాటిని కవర్ చేసుకోవడానికి ఎంతో సింపుల్ పరిష్కారం చూపుతున్న కొన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకున్నారుగా.. మీ సమస్యను బట్టి వీటిని ఎంచుకుని మీ లోపాల్ని సరిచేసుకోవడంతో పాటు బ్యూటిఫుల్‌గా మెరిసిపోండి మరి!
గమనిక: మగువల అందాన్ని, సౌందర్య సంరక్షణలో వారి పనిని మరింత సులభతరం చేసే ఇలాంటి మరెన్నో బ్యూటీ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని చదవండి.
Photos: Amazon.in